#


Back

   శరీరపాతమయ్యేదాకా దాని అడా పొడా కూడా కనిపించదు మనకు. మనల నది అదృష్టరూపంగా మాత్రమే అంటిపట్టుకొని ఉంటుంది. అలా ఉంటూ చివరకు దేహపాతమైన తరువాత లోకాంతరాలకు మనలను తీసుకుపోయి అక్కడ దర్శనమిస్తుంది మనకు. అంటే అది ఇచ్చే ఫలితం మనకక్కడ మాత్రమే అనుభవానికి వస్తుందని అర్ధం. పోతే వేదాంతులు చెప్పే ముక్తి ఫలమిలాంటిది గాదు. అది దృష్టం. అంటే బ్రహ్మజ్ఞాన ముదయించిన వెంటనే కనిపించి తీరాలది మనకు. ఎందుకంటే జ్ఞానమనేది కర్మమాదిరి అనుష్ఠాన రూప Active మైనది కాదు. విచారాత్మక Reflective మైనది. పైగా తత్ఫల రూపమైన ముక్తి కూడ మనమెక్కడికో దేశాంతరం పోయి అందుకొనేది కాదు. బ్రహ్మ స్వరూపానికనతి రక్తమది. మరి ఆ బ్రహ్మమనే దెక్కడ బడితే అక్కడే ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడే ఉన్నది. అంతా అదే. అలాంటప్పుడిక వెంటనే అనుభవానికి రావటంలో అభ్యంతర మేమున్నది అంచేత నూటికి నూరుపాళ్ళూ దృష్ట ఫలమే కావాలది. దృష్టం గనుకనే శరీర పాతమే కానక్కరలేదు. శరీరమున్నప్పుడు కూడా కలగవచ్చు పొమ్మన్నారు జగద్గురువులు.

   అంతేకాదు. మరొక సంగతి. మోక్షం మనకు శరీరమున్నప్పుడే కలగకపోతే బ్రతికున్న వాడెవడూ ముక్తుడు కాడని ప్రకటించవలసి వస్తుంది. ఎవడూ కాకపోతే లోకంలో ఇక అనుభవజ్ఞులైన ఆచార్యులే మనకు కరువయిపోతారు. మరి “ఆచార్యవాన్ పురుషోవేద” అనే ఉపనిషద్వాక్యాని కర్ధమేమిటప్పుడు ఆచార్యుడి సహాయం వల్లనే బ్రహ్మజ్ఞాన మార్జించాలని గదా ఉపనిష దుపదేశం. ఆచార్యుడంటే ఎవడు. “బ్రహ్మవి బ్ర్బహ్మణిస్థితః" బ్రహ్మతత్వాన్ని ఉన్నదున్నట్టు గ్రహించి దానిలోనే నిత్యమూ నిలిచి ఉన్నవాడు. "బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” అన్నట్టు అలాంటివాడు కేవలం బ్రహ్మభూతుడే. అంటే సర్వాత్మనా ముక్తపురుషుడు. అలాంటివాణ్ణి శరీరమున్న నేరానికి ముక్తుడు కాడంటే వాడికపుస్తక జ్ఞాని మాత్రమేగాని అనుభవజ్ఞుడు కాడని చాటవలసి వస్తుంది. అలాంటప్పుడనుభవజ్ఞుడు కానివాడు చెప్పిన మాటలకు విలువేముంది. “స్వయమ్తీర్ణః - పరాంస్తారయతి” అన్నారు పెద్దలు. వాడు తరించి గదా ఇతరులను తరింపజేయవలసింది. వాడికే అసలాస్కారం లేకపోతే మనకు మాత్రమే ముంటుంది.

Page 179