ఈ కుర్రవాడు సింహమేనని ఎవడైనా అంటే సింహమనేది వేరుగా ఉంది. కుర్రవాడూ వేరుగానే ఉన్నాడని మనకు తెలుసు. అయినా సింహానికున్న గాంభీర్య పరాక్రమాది గుణాలు కొన్ని మనసులో పెట్టుకొని వీడు సింహమని సింహత్వాన్ని వాడిమీద ఆరోపించాము. ఆరోపిస్తున్నామని మనకు తెలుసుకూడా. కాని “స్తంభశ్చోరః” చీకట్లో ఒక స్తంభాన్ని చూచి అడుగో దొంగ అని అరిచామంటే స్తంభమనే జ్ఞానం లేదక్కడ. లేకనే దొంగ అనే పదార్ధమక్కడ స్తంభానికి భిన్నంగా లేకపోయినా అనవసరంగా ఆరోపించుకొని భయపడతాము. ఇదీ మిథ్య అంటే.
ఇలాంటి మిథ్యా రూపమే ప్రస్తుత మీ శరీరమనేది. చైతన్యమే అసలు సర్వత్రా ఉన్న పదార్థం. శరీరమనేది దానికి వేరుగా మరొక పదార్థమెక్కడా లేదు. లేకపోయినా స్తంభం మన దృష్టికి చోరుడిలాగా కనిపించినట్టు అదే మన అజ్ఞానదృష్టికి శరీరంగా భాసిస్తున్నది. కనుక ఇది కర్మ మీమాంసకులపోహ పడ్డట్టు గౌణం కాదు. కేవల మాభిమానికమేనని చాటుతారు స్వామివారు. ఆభిమానిక మెప్పుడయిందో అభిమానం తొలగితే చాలు. శరీర సంబంధం కూడా తొలగిపోతుంది. ఇది స్తంభమే గాని దొంగ కాదనుకొని చూచేవాడికి దొంగ ఎక్కడున్నాడు. అలాగే ఇది చైతన్యమే గాని శరీరం కాదనుకొని చూస్తే శరీరమూ లేదు. కనిపిస్తున్నది గదా అంటే అది నీకూ నాకే. మనకు శరీరంగా కనిపించేదాన్ని వాడు చైతన్యరూపంగా దర్శిస్తుంటాడు. కాబట్టి శరీరమనేది ఒకటి ఉండటమూ లేకపోవటంలో లేదు. మనకీ శరీరం మీద అభిమానముండటమే బంధం. అలాంటి అభిమానం లేకపోవటమే మోక్షం. అలా కాకపోతే శరీరమున్న సిద్ధపురుషులందరినీ బద్దులనీ-మృతి చెందిన పామర జనులనందరినీ ముక్తులనీ చాటవలసి వస్తుంది. అది చాలా అన్యాయం. అంచేత శరీరమనేది ఉన్నా మోక్షం మనకు సిద్ధించటంలో ఆక్షేపణ లేదు.
కాకపోయినా మోక్షమనేది దృష్టఫలమని ప్రతిపాదిస్తారు వేదాంతులు. ఇది మీమాంసకుల కర్మఫలం కాదు. కర్మఫలమంతా అదృష్టం మనకు. ఇహంలో మనం జ్యోతి స్టోమాదులైన యాగాదులెన్నైనా చేసి ఉండవచ్చు. ఎన్ని చేసినా చెందినా వాటి ఫలమప్పుడే మన అనుభవానికీ రాదు.
Page 178