అయితే అద్వైతులు అంతా మనస్వరూపంగానే అనుభవానికి వస్తుందని గదా నిరూపించారు. అలాంటప్పుడాఖరు సారిగా కలిగే మోక్షానుభవం కూడా ఏకరూపంగానే unique ఉండాలి గాని మరలా అందులో ఇన్ని భేదాలేమిటటి అని ప్రశ్న వస్తుంది.
వాస్తవమే. అద్వైత మన్నప్పుడిక రెండు మూడనే భేద ప్రసక్తి ఉండటానికి లేదు. కాని ఈ భేదం మేము ముక్తి స్వరూపాన్ని బట్టి చెప్పటం లేదు. అది సంభవించే కాలాన్ని బట్టి చెప్పిన మాట. సాధారణంగా చచ్చిన తరువాతనే మోక్షమని లోకంలో నలుగురూ అనుకొనే వ్యవహారం. అలాకాదు. అది మానవుడు బ్రతికి ఉన్నప్పుడు కూడా కలగవచ్చు సుమా. అందులో ఏ మాత్రమూ అభ్యంతరం లేదని చెబుతారు భగవత్పాదులు. ముక్తి లభించటానికి కావలసిన సామగ్రి మనకు సమకూరవలెనే గాని అది ఎప్పుడు ఫలించినా ఫలించవచ్చు. చచ్చిన తరువాతనే ఫలించాలనే నియమమేమున్నది. సామగ్రి అనేది ఉంటే చచ్చిన తరువాతా కావచ్చు. బ్రతికి ఉన్న సమయంలోనూ కావచ్చు. ఎప్పుడొన గూడినా అది ముక్తే. అందులో బ్రతికినప్పుడే అయితే అది జీవన్ముక్తి అన్నారు. చచ్చిన తరువాత అయితే విదేహముక్తి అన్నారు. కాబట్టి జీవన్ముక్తిని ఒప్పుకోటంలో తప్పులేదు.
అయితే ముక్తి అంటే శరీరాది సంబంధమేమి లేనిదని గదా చెప్పారు. మరి జీవించినంత కాలమూ శరీర సంబంధం మనకు తప్పదు గదా. అలాంటప్పుడది ముక్తి ఎలా అయిందని ఆక్షేపణ వస్తుంది. దీనికి శంకర భగవత్పాదులిచ్చిన సమాధానమిది. శరీర సంబంధమంటే శరీర మనేది ఒకటి మనకు కనిపిస్తూ ఉండటమని గాదు. కనిపించే ఈ శరీరాన్ని నాది అని-నేనని-అభిమానించటం Identity. ఆ మాటకు వస్తే వాస్తవంలో శరీరమనేది లేదసలు. మన అభిమానం వల్లనే ఏర్పడిందది. మిథ్యాభూతమేగాని అది గౌణం కాదంటారు స్వామివారు. మీ మాంసకులు శరీరం గౌణమని వాదిస్తారు. రెండు వస్తువులు వేరుగా కనిపిస్తూ గుణసామ్యాన్ని పురస్కరించుకొని ఒకదాని మీద మరొక దాని నారోపిస్తే అది గౌణం Metaphorical. అలా కాక రెండవ పదార్ధమసలు లేకపోయినా ఒక పదార్ధాన్ని చూచి మరొక పదార్దమని భ్రమపడితే అది మిథ్య Mythical.
Page 177