#


Back

   ఇది పరిపూర్ణ చైతన్యమైనపదార్థం. అసంభవమనే ప్రశ్నేలేదు. జ్ఞానమే దాని స్వరూప మన్నప్పుడనుభవం కూడా ఉండకతప్పదు. జ్ఞానమే గదా అనుభవమని పేర్కొన్నాము. అది జ్ఞేయమైన ప్రపంచాన్ని ఎలా తెలుసుకోగలదో ఆ ప్రపంచం లయమయినప్పుడు తన స్వరూపాన్ని కూడా అలాగే తెలుసుకోగలదు. అలా తెలుసుకోలేదంటే అది ప్రపంచం మీద ఆధారపడుతుందని చెప్పవలసి వస్తుంది. స్వతస్సద్ధమైన తత్త్వమని గదా మొదటి నుంచీ ప్రతిపాదిస్తూ వచ్చాము. అలాంటప్పుడీ ప్రపంచం దానికుంటే నేమిటి లేకపోతే నేమి. దానిపాటికది ఉండి తీరుతుంది. ఉంటే అలా ఉన్నాననే అనుభవంకూడా దానికుండక తప్పదు.

   ఇదుగో ఈ దృశమైన అనుభవానికే ముక్తి అని పేరు. ఇందులో ప్రపంచమనే అనర్ధానికి చోటు లేదు కాబట్టి దుఃఖలేశం కూడా లేదు. సర్వమూ నేనేననే అనుభవం కాబట్టి అది ఎప్పుడూ సుఖమే. ఇలాంటి దుఃఖ నివృత్తీ-సుఖప్రాప్తి సహజంగానే సిద్ధించే దశ అది. శరీరాద్యుపాధుల తోడి సంపర్కమనేది ఉండబోదు కాబట్టి అది నిరావరణం Revealed మన జ్ఞానానికి బాహ్యంగా ఎక్కడా లేదు కాబట్టి ఆత్మరూపం Subjective ఆత్మ రూపమే కాబట్టి నిత్య సిద్ధం Ever present. ఇంతకూ మనకున్న బ్రహ్మాత్మ భావమే The state of Identity with the Absolute ముక్తి అనే మాటకర్థం. "బ్రహ్మ భావశ్చ మోక్షః” అంటారు భాష్యకారులు. బ్రహ్మమూ-బ్రహ్మ జ్ఞానమూ-మోక్షమూ అనేవి వేర్వేరు మాటలు గావు. బ్రహ్మమే జ్ఞానం. జ్ఞానమే మోక్షం. ఇదీ మోక్షమంటే భగవత్పాదుల అభిప్రాయం.

   ఈ మోక్షము-లేదా-ముక్తి అనేది ఆచార్యులవారి దృష్టిలో మరలా రెండు విధాలు. ఒకటి జీవన్ముక్తి. మరొకటి విదేహముక్తి. ఇందులో జీవన్ముక్తి అనేది మానవుడీ శరీరంతో బ్రతికి ఉండగానే లభించేది. మరి విదేహమనేది ఈ శరీరం పోయిన తరువాత సంభవించేది. మిగతా మతాచార్యులెవరే గానీ విదేహముక్తి ఒక్కడే ఉందని భావిస్తారు. జీవన్ముక్తి నెవ్వరూ అంగీకరించరు. జీవన్ముక్తి కూడా ఉందని ప్రతిపాదించిన వారు శంకరుని లాంటి అద్వైతులొక్కరే. అద్వైత దర్శనంలో తప్ప మరెక్కడా లేదీ భావం.

Page 176