అసలది ఒక నామరూపాత్మకమైన వస్తువు కాదు మనమెక్కడో ఎప్పుడోనని భావించటానికి. వాస్తవంలో ముక్తి అనేది బ్రహ్మభావమే The state of being Brahman-the su-preme reality మరి ఈ బ్రహ్మ భావమనేది జీవుడెక్కడి నుంచో క్రొత్తగా కొని తెచ్చుకొనేదికాదు. అతని స్వరూపమే అది. అవిద్యాదోషం మూలంగా అది బహుజన్మల నుంచీ మరుగుపడి పోయింది. అది ప్పుడు బ్రహ్మవిద్యాబలంతో మరలా బయటపడి మన అనుభవానికి వస్తున్నది. ఇంతకుముందొక మాట చెప్పాము. మనకు సహజంగా ఉన్న ఆరోగ్య దశ మధ్యలో కొన్ని రోగలక్షణాలు సంక్రమించటం మూలంగా దెబ్బతిని మరలా తగిన ఔషధసేవ చేయగానే అభివ్యక్తమవుతుందని. అలాంటి పరిస్థితే ఇదీనని భావించాలి మనం.
మరి అలాంటప్పుడిక లోకాంతరాలేమిటి-అక్కడికి మనం చేసే ప్రయాణమేమిటి అక్కడ మనకొకరు ముక్తిని ప్రసాదించటమేమిటి. అదంతా నిజమని ఒప్పుకొంటే మోక్షానికొక ఆది అనేది ఉందని ఒప్పుకొన్న వాళ్ళమవుతాము. అది ఒప్పుకొంటే దాని కంతం కూడా ఒప్పుకొని తీరవలసిందే. అప్పుడా మోక్షం మనకెలా కలిగిందో అలాగే తొలగిపోయే ప్రమాదముంది. ఇక మనకది కలిగి సుఖమేముంది. అది మొదలు చెడ్డ బేరమని హెచ్చరిస్తారు భగవత్పాదులు. కాబట్టి ఏదో చేయబోతే ఏదో అయినట్టు మోక్షమనే భావాన్ని ఎక్కడో పోయి పట్టుకొందామనుకోటం మరలా మనమద్వైత జగత్తునుంచి ద్వైతజగత్తుకు దిగిరావటమే. అప్పుడది మోక్షమెలా అవుతుంది. నూటికి నూరు పాళ్ళూ సంసారమే.
కాబట్టి మొట్టమొదట మనం ముక్తి మోక్షమనే మాట కర్ధమేమిటో సహేతుకంగా విచారణచేసి చూడాలి. కేవలం కట్టుకథల మీద ఆధారపడి మాటాడరాదు. విచారించి చూస్తే ముక్తి అనేది ఒక అనుభవం. అయితే లోకంలో మనకు కలిగే తతిమా అనుభవాల లాంటిది గాదది. లౌకికమైన అనుభవాలేవైనా సరే అనుభవించే వ్యక్తి ఒకడూ-అనుభవానికి వచ్చే పదార్థ మొకటి వేర్వేరుగా ఉంటాయి. పోతే ఇక్కడ అనుభవించే ఆత్మకు భిన్నంగా అసలు వేరొక పదార్ధమనే ప్రశంసే లేదు. ఉన్నదంతా ఆత్మ స్వరూపమే. అంటే తనపాటికి తానే ఉన్నాననే భావం. అయితే ఇది అగ్ని తన్ను తాను కాల్చుకొంటుందని చెప్పినట్టు ఆత్మాశ్రయమనే దోషానికి గురి అవుతుంది గదా అని అడగవచ్చు. అగ్ని అచేతనమైన పదార్థం కాబట్టి కాల్చుకోటమనేది అసంభవం.
Page 175