#


Back

   ప్రయోజనం లేదా ఫలమనేది ఒక భావరూపమైన పదార్ధం Positive Entity. సాధన చేసి మనం దాన్ని అందుకోగలిగినప్పుడే అది ముక్తి అవుతుంది. అంతేగాని ఊరక ఒక అనర్థం నుంచి తప్పించుకోటం మాత్రమేగాదు. అలా తప్పించుకోటం దుఃఖమనేది లేకపోవటం. దుఃఖం లేకపోవటమే సుఖమెలా అవుతుంది. దుర్వాసన లేకపోవటమే సువాసన అంటామా ? ఏవైనా పరిమళ ద్రవ్యాలు తెచ్చి వెలిగించినప్పుడే గదా దాన్ని సువాసన అంటాము. అలాగే సుఖమనేది కూడా ఒక ప్రత్యేకమైన భావం. కాబట్టి ముక్తి కూడా భావరూపమే కావాలని ఆశంక వస్తుంది.

   దీనికి సమాధానమిస్తూ శంకరులేమన్నారంటే-ముక్తి అనేది కేవలం తప్పించు కోవటమే గాదు. మీరు చెప్పినట్టది ఒక స్వతంత్రమైన పదార్థం కూడా. సందేహం లేదు. కాని అది ఏదో ఒక పండులాగా మనం చేతులు సాచి అందుకొనేది మాత్రం కాదు. అంతేగాక ఎక్కడికో పోయి బావుకోవలసింది కూడా కాదు. ఎవరో మనకు ప్రసాదించవలసింది అంతకన్నా గాదు. ఇలాంటి అపోహలే వున్నాయి లోకంలో చాలామందికి. ఒక లౌకికులకే గాదు. ఆ మాటకు వస్తే శాస్త్రజ్ఞులమనుకొనే వారే నూటికి తొంబది తొమ్మిదిమంది అలా భ్రాంతి పడుతుంటారు. ముక్తికోస మిహంలో మనం తగినంత ప్రయత్నం చేస్తే తరువాత మరణానంతరమెక్కడికో ఒక లోకానికి పోతామనీ ఆ లోకానికి అధిదేవత ఎవరో ఆ ముక్తి ఫలాన్ని మనకు ప్రసాదిస్తుందనీ వీరంతా సిద్ధాంతాలు చేసి కూచున్నారు.

   ఇవన్నీ దేశ కాలాది ద్వైత బుద్ధి ఇంకా వదలకుండా చేసే అపసిద్ధాంతాలంటారు శంకరులు. ముక్తి అనేది ఎక్కడికో పోయి అందుకోటానికది ఒకానొక దేశంలో ఉన్న పదార్థం కాదు. అలాగే మనం బయలుదేరి పోవటానికది ఒక కాలంలో చేసే ప్రయాణమూ గాదు. ఇంతకూ మనం మనం చుట్టూ ఉన్న ప్రపంచంలో నిత్యమూ చూచే ఇండ్లూ వాకిండ్లూ-పట్టణాలూ-పర్వతాల లాంటి ఒక మూర్తమైన పదార్ధం కాదది పోయి పట్టుకోటానికి. దేశకాల వస్తువులకు దేనికీ సంబంధం లేని భావమది. ఒక ప్రదేశంలో ఉన్నదంటే ఇక్కడ లేదా అని ప్రశ్న వస్తుంది. ఒక కాలంలో పోయి అందుకోవాలంటే ఇప్పుడీ వర్తమానంలో లేదా అని అనుమానం వస్తుంది.

Page 174