#


Back

   అయిదవ అధ్యాయంలో శమదమాదులవల్ల శ్రవణాదులలో ప్రవృత్తి కలుగుతుందనీ అవి పరిపాకానికి వచ్చేసరికి ఆత్మానుభవము- లేక బ్రహ్మానుభవ మనేది తప్పకుండా సిద్ధిస్తుందనీ -సవిస్తరంగా ప్రతిపాదించాము. దీనితో వేదాంతంలో సాధన అనేది సమాప్తమయిందనే భావించవచ్చు. పోతే ఈ సాధన అంతా సక్రమంగా చేసి బ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకొన్న తరువాత మానవుడికి కలిగే ప్రయోజనమేమిటని ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందే ప్రస్తావన చేసి ఉన్నామొకచోట "ప్రయోజన మనుద్దిశ్య-నమందోపి ప్రవర్తతే” ఏదో ఒక ఫలితం మీద దృష్టి లేకుండా లోకంలో ఎలాంటి మూఢుడు కూడా ఒక పనికి పూనుకోడు, అలాంటప్పుడింత పెద్ద సాధన చేయటానికి మనం పూనుకొన్నామంటే దీనికంతటికీ ఎంతో గొప్ప ఫలితం మనకు కలిగి తీరాలి. కాబట్టి ఏమిటా మహాఫలమని ప్రశ్న రావటం సబబే.

   మహాఫలమని మీరు చెబుతున్నారు. మరేముంటుంది అంతటి మహాఫలం. అది ముక్తి లేదా మోక్షమేనన్నారు శంకర భగవత్పాదులు. మానవుడు దేనికోసమసలు సాధన కుపక్రమిస్తాడో-అదే ప్రయోజనమనే మాటకర్థం. మరి దేనికోస మీ సాధన అంతా. ఎల్లప్పుడూ మనకు కలిగే ఈ సంసార బాధల నుంచి తప్పించుకొని బయటపడటానికే గదా. ఆ బయట పడటానికే ముక్తి అని పేరు. ముక్తి అన్నా, మోక్షమన్నా ఒక్కటే. విడుదల Emancipation అని అక్షరార్ధం. విడుదల దేనినుంచి అనాత్మ రూపమైన ఈ సంసారం నుంచే గదా. కాబట్టి సంసారతాపత్రయం పూర్తిగా తొలగిపోతే చాలు. అదే ముక్తి. అందుకోసమే మనమింతవరకూ చేస్తూ వచ్చిన సాధన అంతా. అంచేత అదే చివరకు మానవుడు సాధించవలసిన ఏకైక ప్రయోజనం. అయితే ఒక ప్రశ్న. సంసార బాధలనుంచి తొలగటమే ముక్తి అని పేర్కొన్నారు. అలా తొలగటం మాత్రమే ముక్తి ఎలా అవుతుంది.

Page 173