#


Back

   అలా చేస్తూ పోతే ప్రారబ్ధం పాటికి ప్రారబ్ధమున్నా దీనిపాటికిది ఫలితమిస్తుంది. అది ఈ జీవితంలోనే ఫలిస్తుందా మరి ఒక జన్మ పడుతుందా అనేది మన సాధన వీర్య విశేషాన్నీ ప్రారబ్ధకర్మ భారాన్నీ బట్టి ఉంటుందంటారు భగవత్పాదులు. అయితే ఇలాగని మరలా నీరుగారిపోకుండా అభ్యాస వైరాగ్యాలతో మనగమ్యాన్ని మనం చేరే ప్రయత్నంలో మనముంటే ఆ తరువాత అదే మార్గంలో అన్ని విఘ్నాలనూ పారదోలి నిర్విఘ్నంగా తోడుకొనిపోయి ఎప్పటికైనా తప్పకుండా మన జీవిత గమ్యమైన బ్రహ్మాత్మానుభావాన్ని మనకు ప్రసాదిస్తుందని ఆయన మనందరికీ ఇచ్చిన అభయ హస్తం.

   ఇంతవరకూ సాగిన విచారణద్వారా మనం తేల్చుకొన్న ముఖ్య విషయమేమిటని అడగవచ్చు. బ్రహ్మభావమైన మోక్షం మానవులందరికీ స్వభావ సిద్ధమే. స్వాభావికమైన దాన్ని మన అవిద్యాదోషం వల్ల విస్మరించాము. విస్మరించి కూడా ఎన్నో జన్మలయింది. మరలా దాన్ని మనమిప్పుడనుభవానికి తెచ్చుకోవాలంటే శాస్త్రం మనకు విద్యోపదేశం చేస్తున్నది. దానివల్ల బ్రహ్మాకారవృత్తి ఉదయిస్తే అది అవిద్యను నిర్మూలించి వెంటనే మనకు బ్రహ్మానుభవం ప్రసాదించాలి. కాని ప్రాక్తనమైన కర్మవాసనలు ప్రారబ్ధ రూపంగా దానికడ్డు తగులుతుంటాయి. అలాంటి ప్రతిబంధమున్నంత దనుకా అది మనకు వెంటనే పని చేయదు. కనుక దాన్ని నివారించుకొనే ప్రయత్నం చయాలి మానవుడు. అదివారి అధికారభేదాన్ని బట్టి ఒకరికి శమాదులైతే వేరొకరికి శ్రవణాదులు. అందులో మొదటిది రెండవదానికి దారి తీస్తే అవి అంతకంతకు వృద్ధి పొంది కర్మ ప్రాబల్యాన్ని తగ్గిస్తూ పోతే పురుష ప్రయత్నం ఫలించి సాధకుడికి క్రమంగా బ్రహ్మజ్ఞానమూ అనుభవమూ అవశ్యంగా సిద్ధిస్తాయి. ఆ మార్గంలో గుర్వపేక్ష అందరికీ ఉండి తీరాలనే ప్రమేయం కూడా లేదు. ఏదేది ఆ అనుభవానికి తోడ్పడితే అదే గురువు సాధకుడికి. మరి ఆ అనుభవ మీ జన్మలోనే లభించినా లభించవచ్చు. లేదా మరికొన్ని జన్మలైనా పట్టవచ్చు. దాన్ని గురించి చింత పెట్టుకొని ప్రయత్న లోపం చేయరాదు. అనన్యాశ్చింతయంతోమా మన్నట్టు తదేక దృష్టితో ప్రయాణం సాగిస్తే చేరేనాటికి గమ్యం చేరుతాము. చేరుతామో లేదో నని సందేహిస్తుంటే ఎక్కడి వాళ్ళమక్కడే ఉండిపోతాము. అంచేత దీక్షతో ముందుకు సాగిపోవటమే ముఖ్యమైన విషయం.





Page 172