#


Back

   ఆ మాటకు వస్తే ఒక వ్యక్తే కాదు - గ్రంథమే కాదు. వారి వారి సంస్కారాన్ని బట్టి పాత్రతను బట్టి గురుస్థానంలో ఏది ఉన్నా ఉండవచ్చు. ఏదేది ఆత్మ ప్రబోధమందిస్తే అదంతా మన పాలిటికి గురువే. బృహదారణ్యకంలో ఒక కథ ఉన్నది. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు జన్మించి అటూ ఇటూ చూచాడట. చూస్తే తాను దప్ప కంటికి మరెవరూ కనిపించలేదు. కనిపించకపోయే సరికి కొంచెం భయపడి మరలా తేరుకొని "యన్మ దన్యన్నాస్తి కస్మాన్ను బిభేమి” నాకన్నా ఇతరమైన వస్తువు లేదు గదా నేనెందుకు భయపడాలను కొన్నాడట. "తత ఏవాస్య భయమ్ వీయాయ” ఆ ఏకత్వ దర్శనంతోనే అతని భయం పోయిందట. దీనిమీద వ్యాఖ్యానిస్తూ భగవత్పాదులు ప్రజాపతికా ఏకత్వ దర్శనమెలా అబ్బింది ఎవడు బోధించాడు ఏ గురువూ లేడు గదా అప్పుడు గురువు లేకుండానే విద్య అలవడేట్టయితే మనకు మాత్రమెందు కలవడదని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. దీనికి మరలా కావలసి వస్తే మరొకరి కక్కరలేకుండానే బోధ కలుగుతుందని సమర్ధిస్తారు. అయితే శ్రద్ధాది సామగ్రీ శ్రవణాది సామాగ్రి ఇవి రెండూ ఎవరికైనా సరే జ్ఞానమందివ్వటంలో ఐకాంతిక సాధనా Invariably Effective means లంటారాయన. అవి పూర్వ జన్మలలోనే చాలావరకూ ఒనగూడి ఉంటే ప్రకృత జన్మలో గుర్వపేక్ష లేకుండానే సాగుతుంది విచారణ. లేని పక్షంలో తప్పకుండా కావలసి వస్తుంది. ఇదీ వినిగమక Deciding factor మిందులో.

   కాబట్టి గురువుండాలి గదా అని బలవంతంగా ఒక బాధ గురువు పాలబడకుండా సమ్యక్రమాణాలను శ్రవణం చేస్తూ - దానికి స్తోమత లేకపోతే శమదమాదుల నవలంబిస్తూ- అది కాకుంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలాచరిస్తూ తద్ద్వారా కాయేంద్రియాది శుద్ది కలిగితే దాని మూలంగా వివేచనా శక్తి పెరుగుతూ పోతే-దాని బలంతో ప్రారబ్ధకర్మ ప్రభావం తరుగుతూ వస్తే అంతకంతకు శ్రవణమనన నిది ధ్యాసనలలో ఉత్తీర్ణుడయి సాధకుడు నిరంతర బ్రహ్మచింతనలో ఉండగలడు. తచ్చింతనమే తదనుభవం కాబట్టి అనుభవం కలగలేదే అనే ప్రశ్నే ఉండదప్పుడు ఒకవేళ మేము జ్ఞానమే అనుభవమని చెప్పినా అది కేవల శబ్దార్థజ్ఞానం కాదు. తదర్ధస్మృతి ఏర్పడాలి మనస్సుకు. ఈ స్మృతి బలంతో నిత్యమూ ఈ అనాత్మ జగత్తును తదాకారంగా దర్శిస్తూ రావాలి. ఇది పైకి కనిపించినంత సులభం కాదు. దానిని పట్టుకోటానికెంతో మెళకువ కావాలి. ఇదే మనం చేయవలసిన ప్రయత్నమంతా అంతకు మించి మరేమీలేదు.

Page 171