#


Back

   అయితే ఒక ప్రశ్న. ఈ సాధన మార్గంలో మనకు గురువనే వాడి అవసరముందా లేదా అని. ఆచార్యుల వారి మతంలో అవసరమేనని తోస్తుంది. శాస్త్రమూ ఆచార్యుడూ-ఇరువురూ అవసరమేనని ఎన్నో చోట్ల హెచ్చరిక చేస్తాడాయన. “శాస్త్రాచార్యోప దేశ శమదమాది సంస్కృతమ్ మనః ఆత్మ దర్శనే కరణమ్” ఆత్మను దర్శించాలంటే వీటన్నింటి సహకారమూ ఉండాలట మానవుడి మనసుకు. “గురూప దిష్ట కలా ప్రలయ మార్గః" ప్రాణాదికళల నన్నింటినీ ప్రవిలయం చేసి నిష్కలమైన స్థితినందుకోవాలంటే ఆ మార్గాన్ని గురూపదేశం వల్లనే తెలుసుకోవాలంటాడాయన ప్రశ్నోపనిషద్భాష్యంలో. ఎంత శాస్త్ర జ్ఞానమున్నా గురుముఖంగా అభ్యసిస్తేనే అది అనుభవానికి వచ్చేదని ముండక భాష్యంలో స్పష్టంగా చాటుతారు. “ఆచార్యవాన్ పురుషోవేద" అని అసలు వేదమే ఘోషిస్తున్నది గురువనే వాడుండి తీరాలని. అందులో సబబేమంటే మనమిప్పుడు కూడా చూడవచ్చు. వైద్యశాస్త్రమొకటి ఉన్నా వైద్యుడనే వాడి సహాయం లేకపోతే మనకది పని చేయదు. న్యాయశాస్త్రమున్నా దాని విషయం తెలిసిన న్యాయవాది ఉంటేనే మనం నెగ్గుతాము. ప్రతి విద్యలో కొన్ని సూక్ష్మాలుంటాయి. అవి ఎవరి పాటికి వారు గ్రహించేవి కావు. "ఉభయోరపి దృష్టోంత స్వనయోస్తత్త్వ దర్శిభిః" అన్నట్లు దాని అంతు చూచిన తత్త్వదర్శి తోడ్పాటు కావలసి ఉంటుంది. మామూలు విద్యలలోనే ఇలాంటి పరిస్థితి అయినప్పుడిక బ్రహ్మవిద్య సంగతి చెప్పేదేముంది. ఎంతైనా అవసరమక్కడ గురుసహాయం.

   అయితే గురువనగానే కరచరణాద్యవయవాలతో ఉన్న ఒకానొక పురుషుడే కానక్కరలేదు. వాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైతే సరిపోయేగాని లేకపోతే ఎవడో ఒక గురువుండాలి గదా అని బుట్టబొమ్మలాంటి వాడి నొకడినిపెట్టుకొంటే సుఖమేముంది. అలాంటి గురువులంతా మన పాలిటికి బరువులు. "స్వయమ్ మూఢః పరాంశ్చవ్యామోహయతి” అని భగవత్పాదులు చెప్పినట్టు తాము మూఢులై ఇతరులను కూడా మూఢులను చేస్తారు. పరీక్షిత్తుకు శుకుడిలాగా - జనకుడికి యాజ్ఞవల్క్యుడిలాగా యాదృచ్చికంగా ఎవడైనా మహనీయుడు దొరికితే మంచిదే. లేకుంటే కొంచెం తెలివితేటలు కలవాడు శాస్త్రాన్నే నమ్ముకోవటం మేలు. అది కూడా సమ్యక్రమాణం కావాలన్నారు భగవత్పాదులు.

Page 170