అదేమిటంటే మనకున్న శక్తి సామర్ధ్యాలను బట్టి ఒకవేళ మన మీ కర్మానుష్ఠానంతో కాలం గడుపుతున్నా ఇది కేవలమొక మజిలీయేగాని గమ్యంగాదనే దృష్టి ఉండాలి కర్మిష్ఠులకు. అప్పుడు వాడు పయివాణ్ణి తప్పు పట్టడు. మీదు మిక్కిలి తానూ కృషిచే పైస్థాయి కెదగాలని ఆసిస్తాడు. అలాగేతాను బ్రహ్మ విచారణ చేస్తూ కర్మానుష్ఠానం వైపు మొగ్గు చూపకపోతే పోవచ్చు గాని అది కేవలం మూఢాచారమనీ దానిని మానుకోవటమే గొప్ప గుణమనీ భావించరాదు జ్ఞానసాధకుడు. తన కక్కరలేకపోయినా దాని అక్కర ఉన్న వాళ్ళెందరో ఉంటారు లోకంలో. కాదని కొట్టివేయటం దేనికి. ఇలా సానుభూతిగా అర్ధం చేసుకోగలిగితే అహంకార విక్షేపాది దోషాలు నశించి జ్ఞానీ నిర్మలుడవుతాడు.
వీరి సంబంధమొక విధంగా విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ ఉన్న సంబంధం లాంటిది. ఎప్పుడూ - విద్యార్ధి విద్యార్ధిగానే ఉండిపోరాదు. ఉపాధ్యాయుడి కోవనందు కోవాలని కోరుకోవాలి. దానికి తగిన కృషి చేయాలి. అంతేగాని ఉపాధ్యాయుడే క్రిందికి దిగి తనస్థానానికి రావాలని కోరరాదు. అలాగే ఉపాధ్యాయుడుకూడా తానుపై కెదిగాను గదా అని విద్యార్ధి దశను ఈసడించరాదు. తానూ ఒకప్పుడు విద్యార్ధినే గదా అనే విషయం మరచిపోరాదు. ఒకవేళ తాను మరలా వారితో కలిసి కూచోకపోయినా వారి లోటుపాటులను సహిస్తూ ఎప్పటికైనా తన స్థాయికి వారిని లాగుకొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే పరస్పరమూ ఉపకార్యోప కారకరూపమైన సంబంధం పెరుగుతూ పోతుంది. ఇలాంటి సత్సంబంధమే కర్మిష్ఠులూ జ్ఞానులకూ ఇరువురికీ అపేక్షణీయం. అప్పుడిద్దరూ రెండుదారులు గాక కొంచెమిటూ అటూగా ఒకే మార్గంలో ఉన్నవాళ్ళవుతారు.
మొత్తంమీద సన్మార్గంలో అడుగుపెట్టి నప్పటి నుంచీ తదేక నిష్ఠతో జీవితం గడిపేదాకా అంతా సాధనే. సాధన మార్గంలో ఏ మానవుడేస్థాయిలో ఎంతెంత ప్రయత్నిస్తే అంతంత ప్రారబ్ధకర్మ ప్రక్క వంచుతుంది. అది సడలే కొద్దీ అభ్యాసం పెరుగుతూ పోతుంది. ఇలా కిందా మీదా పడుతూ పోతే క్రమంగా కర్మ పిశాచాన్ని ప్రయత్న కరవాలంతో తునాతునకలు చేసి మానవుడు సాహస విక్రమార్కుడి లాగా ముందుకు సాగిపోనూ గలడు. ఎప్పటికో ఒకప్పటికి తన అభీష్టఫలాన్ని అందుకోనూ గలడు. భయం లేదు.
Page 169