#


Back

   కాబట్టి ఇంతకూ చెప్పవచ్చిందేమంటే ఎవరికెన్ని జన్మలు గడిచాయో మనం చొచ్చి చూచింది గాదు. ఈ జన్మలోనే మనం నలుగురినీ చూస్తున్నాము. వారి వారి నడవడిని బట్టే వారి అంతర్గతమైన సంస్కారాన్ని మన మూహించుకోవలసి ఉంటుంది. అందులో ఉత్తమాధికారులుండవచ్చు. మధ్యములుండవచ్చు. మందులూ అతిమందులూ కూడా ఉండవచ్చు. వారి దృక్పధాలూ బాహ్యప్రవృత్తులూ వారి అంతస్తులకు తగినట్టుగానే వ్యవస్థితమై ఉంటాయి. ఎవడైనా తీర్ణాట నాదులు పూజా పురస్కారాదులూ - చేయటానికంత సుముఖత చూపకపోతే వాడా అంతస్తు దాటిన కర్మయోగి అయి ఉండచ్చు. అది కూడా మాని ఎప్పుడూ వేదాంత గ్రంథపఠనమూ, చింతనమూ, పదిమందితో గోష్టి జరుపుతూ ఉంటే అంతకన్నా పయిమెట్టు వాడయి ఉండవచ్చు. అలాంటి వ్యాసంగం కూడా పట్టుకోటమిష్టం లేక నిరంతర విచారణ శీలుడయి చాలా మితభాషిగా మితచారిగా ఎవడైనా కనిపిస్తే వాడింకా ముదిరి పాకాన బడ్డ సాధకుడనుకోవాలి. అసలీ ప్రపంచాన్నే సన్న్యసించి పోయినవాడైతే ఇక చెప్పలేము. అయితే ఇక్కడ ఒక తిరకాసున్నది. సన్న్యసించిన వాళ్ళంతా మహాత్ములనుకోరాదు. కొందరు వివిదిషులైతే కొందరు విద్వాంసులు. ఇందులో మొదటివారి దాశ్రమ సన్న్యాసం. "సన్న్యస్య శ్రవణం కుర్యాత్తనే న్యాయాన్ని బట్టి వీరు శ్రవణాదుల నభ్యసించటానికి వీలుగా ఉంటుందని గార్హస్థ్యాన్ని విడిచి వెళ్ళినవారు. వీరే వివిదిషా సన్న్యాసులు. మరి విద్వత్సన్న్యాసులు శ్రవణ మననాలు రెండూ సమాప్తమైన తరువాత జ్ఞానులై ఆ జ్ఞానంలోనే సదా నిలిచి ఉండే సన్న్యాసులు. పరమహంసలన్నా వీరే. నిరంతర జ్ఞాననిష్ఠ తప్ప వీరికిక ఏ కార్యమూ లేదు. కాషాయ దండకమండలాది బాహ్యచిహ్నాలు కూడా వీరి కక్కరలేదన్నారు పరమహంస పరివ్రాజక సార్వభౌములు భగవత్పాదులు.

   ఇన్ని అంతస్తులున్నాయి కాబట్టి ఈ మార్గంలో- ఎవరిందులో ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించకుండా పయివాడు కర్మభ్రష్టుడని క్రింది వాడూ క్రిందివాడు వట్టి కర్మ జడుడని పయివాడు-ఒకరినొకరు తప్పు పట్టరాదు. ఒక విషయం తెలుసుకొంటే ఎవరెవరినీ తూలనాడే ప్రసక్తి ఉండదు.

Page 168