#


Back

  అలాంటి వారి నుద్దేశించి భాగవానుడే అన్నాడు "న కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుషో శ్నుతే-నచ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి” అని వారితో వీరిని పోలిస్తే ఎలాగ. ఆ మాటకు వస్తే అసలైన కర్మభ్రష్టులీ కర్మానుష్ఠాతలే. ఎందుకంటే వేదాంత మార్గంలో ఉన్నామని చెబుతూ వీరు కర్మలాచరిస్తున్నారు. కర్మాచరణకూ వేదాంత విచారానికీ సంబంధమే లేదు. అది దీని కుపాయమే గాదు. దాని కుపాయమొక శ్రవణాదులే. ఇంకా కావలసి వస్తే కర్మయోగ మభ్యసించవచ్చు. అంతేగాని కర్మానుష్ఠానమేమిటి. అలా చేస్తే అనగూడదు గాని ఆత్మవంచన క్రిందికి వస్తుంది. ఎందుకంటే మేమూ వేదాంతులమే ననిపించుకోవాలని ఒక ఆశ వీరికి. కానీ దానికి తగిన సంసిద్ధతా చిత్త పరిపాకమూ లేదు వాస్తవంలో. మీదు మిక్కిలి దానికి ప్రతికూలమైన కర్మాచరణతోనే కాలం గడుపుతున్నారు. ఇంతకన్నా వేరే ఆత్మవంచన ఏమున్నది. అంతేగాక నిజాయితీగా ఆత్మవిచారణ చేస్తున్న వారిని అసూయాగ్రస్తులై దూషిస్తున్నారు. అసలు పైనవడ్డీ అన్నట్టు ఇది ఆ ఆత్మ ప్రతారణకు చేరే మహాపాపం.

   అలాగే కేవల కర్మ పరాయణులను తప్పు పట్టటం కూడా ఒక మహాపరాధమే. గ్రుడ్డికన్నా మెల్ల మేలన్నారు. జ్ఞానం కోసమని కాకపోయినా స్వధర్మమనే దృష్టితోనైనా చేస్తున్నారు కర్మ. పాపకర్మలు చేయటం కన్నా బేహోదాగా బ్రతకటం కన్నా సత్కర్మాచరణ మనేది మంచిదే గదా. దానివల్ల ఒక తృప్తి - ఒక ఆస్తిక్య బుద్ధి ఇలాంటి మంచి గుణాలలవడుతాయి. క్రమంగా అదే కొంత కాలానికి కర్మయోగంగా మారి ఆ తరువాత శ్రవణాదులకు ప్రోత్సహిస్తాయి మానవుణ్ణి. పైగా ఆడంబరంగా మాటలు చెప్పి ఏ విచారణ చేయకుండా చేసినట్టు నటించే దానికంటే ఏదో పెద్దలు చెప్పారు. మన పూర్వులంతా ఈ మార్గంలో నడిచారు- మనమూ ఆ దారిలో నడవటమే మంచిదనే గౌరవ బుద్ధితో సదాచారాన్ని పాటించటంలో పొరబాటు లేదు. కనీసం పశుప్రాయంగా బ్రతికే అర్బుద న్యర్బుదాలైన పామర జనులకంటే మానవ ధర్మంతోనైనా జీవయాత్ర సాగిస్తున్నా మనిపించుకోగలరు. సన్మార్గంలో ప్రవేశముంటే చాలు. ఎప్పటికైనా అది పరమార్థాన్ని చేరటాని కేదోవిధంగా సహకరిస్తుంది. అసలు శాస్త్రహృదయం కూడా అదేనంటారు స్వామివారు. “సన్మార్గస్థా స్తావద్భవంతు - శనైర్బోధయిష్యామి” అని ఆలోచిస్తుంటుందట శాస్త్రం.

Page 167