#


Back

   అలాంటి వాణ్ణి చూచి – చూడు - చూడు -వాడు జపహోమాదులూ సంధ్యావందన దేవతార్చనాదులూ - అన్నీ మానివేసి కర్మ బాహ్యుడై పోయాడని ఆక్షేపించరాదు. అంతకన్నా పై భూమికలో ఉన్నాడని ఇంకా సంతోషించాలి మనం.

   బాగా జ్ఞానం ముదిరి సన్న్యసించిన తరువాతనే కర్మలు మానేయాలి గాని అంతకుముందు గానే మానుకోటం మహాపాపమంటారు కొందరు. అది కూడా అర్ధం లేనిమాటే. కర్మానుష్ఠానం చేస్తేనే గొప్ప అనుకోరాదు. కర్మయోగమంతకన్నా గొప్పది. మరి అంతకన్నా గొప్ప శ్రవణాదులు. వేదాంత శ్రవణం చేస్తున్నాడంటే అంతకన్నా పవిత్రమయిన కర్మానుష్ఠానమేముంది. అసలనుష్ఠానమూ అననుష్ఠానమూ గాదు. దేనికైనా చిత్తశుద్ధి - పారమార్ధిక బుద్ధి ఉండాలి. అవి రెండే ముఖ్యం. అవి ఉన్నవాడు బాహ్యంగా కర్మ చేయనంత మాత్రాన ప్రమాదమేముంది. లేనివాడు లాంఛనార్ధంగా చేసి మాత్రం ప్రయోజనమేముంది. అలాంటివాడిని విమూఢాత్మా మిథ్యాచారః అని గీతాచార్యుడే చీవాట్లు పెట్టాడు. దానికి భిన్నంగా “యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున” అని కర్మయోగిని ప్రశంసించాడు. అంతకన్నా పరిణతి చెందితే “యస్త్వాత్మ రతి రేవస్యాత్-తస్య కార్యం న విద్యతే” అని జ్ఞాని కేకర్మా అక్కరలేదని అభయమిచ్చాడు. జ్ఞానికే కాదు. జ్ఞానం కోసం ప్రయత్నించే జిజ్ఞాసువుకు కూడా అలాంటి నిర్బంధం లేదంటాడు. "ధ్యానయోగపరో నిత్యం" అని ఒక వాక్యం. ధ్యానమంటే ఆత్మ స్వరూపచింతనం. యోగమంటే దానిలో ఏకాగ్రత. ఇవి రెండేనటకర్తవ్యం నిజమైన జిజ్ఞాసువుకు. మధ్యే మధ్యే పానీయమన్నట్టు మిగతా కర్మలు కూడా చేయవచ్చునేమోనని శంకించకుండా నిత్యమనే మాట ప్రయోగించబడిందంటారు భాష్యకారులు. "నిత్య గ్రహణం మంత్ర జపాద్యన్య కర్తవ్యాభావ ప్రదర్శనార్థం" నిత్యమనటం వల్ల మంత్ర జపా ద్యనుష్ఠానాదులిక ఏవీ చేయనక్కరలేదని చెప్పటానికట.

   చూడండి. శాస్త్రార్థమింత స్పష్టంగా ఉన్నా ఇంకా మనం పిచ్చిలో పడుతున్నామంటే దానికి నిష్కృతి లేదు. కర్మ భ్రష్టులని వారిని వీరు నిందించనక్కర లేదు. కర్మభ్రష్టు లెవరంటే అటు బ్రహ్మ జిజ్ఞాసా లేక-ఇటు విహిత కర్మలూ మాని కేవలమూ ప్రాపంచికంగా బ్రతుకు సాగించే వ్యక్తులు.

Page 166