"అనేక జన్మ సంసిద్ధ-స్తతోయాతి పరామ్ గతిమ్” చేస్తూ పోతే ఒక్కొక్క జన్మకు కొంచెం కొంచెం జ్ఞానధనాన్ని పోగు చేసుకొని అది పరిపూర్ణమయ్యే సరికి "బహునామ్ జన్మనా మంతే" కడపటి జన్మలో సర్వమూ మన స్వరూపమే ననే అద్వైతాత్మాను భవం తప్పకుండా సాధించగలం. ఇంతకూ “కృషితో నాస్తి దుర్భిక్ష”మనే మాట ఖాయం.
అయితే ఇక్కడ ఒక రహస్యం మాత్రం మనం గుర్తుంచుకోవలసి ఉంది. కృషి చేయమన్నారు గదా అని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందు చెప్పిన కర్మయోగమూ - సమాధి యోగమూ -శ్రవణాదులూ అన్ని సాధనలు చేస్తూ పోవాలని భావించరాదు. అందరూ అన్నీ ఆచరించి తీరాలనే నిర్బంధం లేదు. అధికారభేదమనేది ఎప్పుడూ ఉంటుంది. పైగా ఈ జన్మతోనే ఆరంభం కాలేదు మన యాత్ర. ఇంతకు పూర్వమెన్ని ఎత్తామో ఇక మీదట ఎన్ని ఎత్తబోతామో. కొందరి కిది మధ్యమైతే మరికొందరు మహనీయుల కిది అంత్యమైనా కావచ్చు. అంచేత వారి వారి యోగ్యతకు తగినట్టు వారు తమ సాధన సాగించవలసి ఉంటుంది. మరీ మందకొడికైతే కర్మానుష్ఠానమే. కొంత ఆలోచనా పరుడికి కర్మయోగం. బాగా జిజ్ఞాస ఉంటే శ్రవణం. ఇంకా ఉంటే మననం. అదీ దాటి పరిణతి చెందినవాడికైతే నిదిధ్యాసనమే. దానిని మించి ఇక చేయవలసిన అభ్యాసమే లేదు జీవితంలో. ఈ విషయాన్నే భంగ్యంతరంగా బయటపెడతా రొకచోట శంకరులు. “యే యథామామ్ ప్రపద్యంతే” అనే శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ఫలాపేక్ష లేని ముముక్షువులైతే వారికి భగవానుడు జ్ఞానం ప్రసాదిస్తాడనీ, జ్ఞానులైన వారికి మోక్షమే ప్రసాదిస్తాడనీ, మరి కేవల మార్తులై సేవించే వారి కార్తిహరణం మాత్రమే చేస్తాడనీ ఇలా మన యోగత్యను బట్టి ప్రయత్నమూ ప్రయత్నాన్ని బట్టి ఫలితమూ ఉంటుందని చాటుతారు.
కాబట్టి పిడుగుకూ బియ్యానికీ ఒకటే మంత్రమని కూచోరాదు. ప్రతి ఒక్కసాధకుడూ వేదోక్తమయిన కర్మనే నిత్యమూ ఆచరించాలని లేకుంటే భ్రష్టుడేనని తిట్టిపోయరాదు. ఏమో మామూలు కర్మానుష్ఠానం కాకుండా కర్మయోగం చేస్తున్నాడేమో వాడు మనకేమి తెలుసు. అలాగే కొందరు శమాదుల కోసమే యత్నిస్తూ ఉండవచ్చు. మరికొందరివి ఏవీగాక శ్రవణాదులతోనే కాలం గడుపుతుండవచ్చు.
Page 165