#


Back

   వేదాంతానామ్-అత్యంత బహిర్విష యాసక్తి బుద్ధీనాం - సమ్యక్రమాణేషు అకృత శ్రమాణాం” గురు సంప్రదాయం కరువయి వేదాంత శాస్త్రం మొగమైనా చూడక నిత్యమూ బహిర్విషయాలలో మునిగి తేలుతూ - సరియైన జ్ఞాన సాధనాలలో పరిశ్రమ చేయకపోతే సందేహమనేది ఎలా వదులుతుంది. ఇలాంటి దుష్ట గుణ చతుష్టయ మున్నంతవరకూ అది అత్యంత ప్రసిద్ధమూ- ఆసన్నతరమూ- ఆత్మభూతము సువిజ్ఞేయమూ అయినా అతిదూరంగానూ అవిజ్ఞేయంగానూ అనాత్మ భూతంగానూ భాసించటంలో ఆశ్చర్యంలేదు. అలా కాక లబ్ధ గుర్వాత్మ ప్రసాదులై బాహ్యాకార నివృత్త బుద్ధులైన మహాత్ములకైతే- నాతః పరమ్ సుఖం-సుప్రసిద్ధం సువిజ్ఞేయ మస్తి - అని ముక్త కంఠంతో సాధక లోకానికి చాటుతారాయన.

   అంచేత మనబోటి అల్పజీవులకూ మందభాగ్యులకూ ఈ కలికాలంలో అంత పెద్ద నిక్షేప మబ్బుతుందా లేదా అని సంకోచించనే అక్కరలేదు. నిక్షేపంగా అబ్బుతుంది. ఆత్మచైతన్య మొకరిలో ఎక్కువా ఒకరిలో తక్కువా అనే తేడా లేదు. పిపీలిక నుంచి బ్రహ్మదాకా ప్రాణులందరిలో సమానంగా పరచుకొని ఉందది. అయితే అది అలా ఉన్నట్టు గుర్తించి అంతకంతకు సాధనచేసి అందులో సిద్ధులయి కూచున్నారు ఇంద్రాది దేవతలూ-వామదేవాది మహర్షులూ అందుకే వృత్తవధాదులైన అకార్యాలెన్ని చేసినా “తస్యమే తత్రలోమచ నమీయతే" నా వెంట్రుక కూడా పోలేదని ధీమాగా చెప్పగలిగాడు దేవేంద్రుడు. అలాగే "తద్దైత త్పశ్య స్పృషి ర్వామ దేవః ప్రతి పేదే హం మను రభవం సూర్యశ్చ" వామదేవుడనే ఋషి తల్లి గర్భంలో పిండరూపంగా ఉండగానే నేను మనువునయ్యాను - సూర్యుడనయ్యా - నీ సమస్తమూ నేనే అయి కూచున్నానని కేక పెడతాడు. "అహమేవ పరం బ్రహ్మ" అనే అద్వైత మూల మహామంత్రార్ధం ఒంటబట్టకపోతే అలా అనే ధైర్యం వారికెలా వస్తుందని ప్రశ్నిస్తారు భాష్యకారులు. "వర్తమానాశ్చ బ్రహ్మవిదః" ఇప్పుడీ రోజుల్లో కూడా ఉన్నారలాంటి బ్రహ్మవేత్త లెందరో నని మనకు పూచికత్తిస్తారు. కాబట్టి పదార్ధమున్నప్పుడు అది మనదే అయినప్పుడు మన అనుభవానికి రాక పోదు. ఎటు వచ్చి దాన్ని మరలా మన సొంతం చేసుకోటానికి కృషి చేయటమొక్కటే మన బాధ్యత.

Page 164