#


Back

   “మయి సర్వాణి కర్మాణి సన్న్య స్యాధ్యాత్మ చేతసా-నిరాశీ న్నిర్మమోభూత్వా" అన్నాడు భగవానుడు. ఇందులో సర్వకర్మలూ అనటంవల్ల శాస్త్రీయ లౌకికాదులన్నీ కలిసి వస్తాయి. వాటన్నింటినీ అధ్యాత్మ చేతసా అంటే వివేక బుద్ధితో నిరాశీర్నిర్మమః అంటే అహమ్మ మాభిమాన వర్జితంగా “మయి సన్న్యస్య” పరమాత్మ మీదనే పడవైచి అని అర్ధం చెప్పారు భగవత్పాదులు.

   ఇది కర్మయోగం గాక కర్మానుష్ఠానమెలా అవుతుంది. కాబట్టి కేవల కర్మానుష్ఠాన మప్పటికి భగవానుడి మతం కాదన్న మాట. పైగా "వేద వాదరతా నిత్యమ్–నాన్య దస్తీతి వాదినః" అని అలాంటి కర్మ జడుల నందరినీ ఈసడించుకొంటాడు. అయితే మనం చేసే కర్మలన్నీ పనికిరానివేనా అంటే మోక్షసాధన మార్గంలో మాత్రమే పనికి రావని చెబుతారు భగవత్పాదులు. యోగదృష్టి లేకుండా కేవలానుష్ఠానం వల్లనే ముక్తి ఫలం కూడా చవిచూడాలని భావిస్తే మాత్రమది కేవలం శుష్క మనోరథమని ఘంటా పథంగా చాటుతారాయన.

   బాగానే ఉంది. కాని పరమార్థ సాధన కసలు జ్ఞానం తప్ప ఎలాటి కర్మ కూడా పనికి రాదని గదా మీరు ప్రతిపాదించారు. అలాంటప్పుడు కర్మయోగమని చెప్పినా అదీ ఒక కర్మేగదా. మరి వాటిని మీరు సాధనాలుగా ఇప్పుడెలా స్వీకరించారు. స్వీకరిస్తే అది మీ సిద్ధాంతానికే విరుద్ధం కదా అని మరలా ఒక పెద్ద ఆక్షేపణ వస్తుంది. దీనికి కూడా చక్కని సమాధానమిచ్చారు భగవత్పాదులు. బహిరంగమైన శమ దమాది కర్మయోగం గాని అంతరంగమైన శ్రవణాది జ్ఞానయోగం గాని సాక్షాత్తుగా ఆత్మతత్వాన్ని సాధిస్తాయని చెప్పటం లేదు. అవి ఆత్మ దర్శనానికి అడ్డు తగిలే పాపకర్మనూ - అజ్ఞాన సంశయాదులనూ నిర్మూలించటానికి మాత్రమే ఉపకరిస్తాయి. అందులో కూడా ఒక క్రమముంది. ప్రప్రథమంగా మనం చేసుకొన్న దుష్కర్మ ప్రబలంగా ఉంటే దాన్ని సత్కర్మాచరణతో తొలగించుకోవాలి. తరువాత శమదమాది రూపమైన కర్మ యోగంతో సద సత్కర్మలను రెంటినీ నిర్లిప్తంగా భావించాలి. తన్మూలంగా మనోముకురం మసృణీ భూతమైతే శ్రవణ మననాదులు సాగించాలి. ఆ తరువాత వీటన్నిటి ఫలితంగా బ్రహ్మజ్ఞానం దాని పాటికదే ఏర్పడుతుంది. సిద్ధమైన తత్త్వం కాబట్టి దాన్ని సాక్షాత్తుగా ఏదీ సాధించనక్కరలేదు.

Page 162