#


Back

   జ్ఞాన దృష్టితో చూచి సన్న్యసిస్తే - అది చివరకు జ్ఞాన నిష్ఠగా పరిణమించి మనకు బ్రహ్మానుభవాన్ని ప్రసాదిస్తుందని దీనిలో దాగి ఉన్న ఒక చక్కని క్రమాన్ని ఉగ్గడిస్తారు. జగద్గురువులు. అంచేత సత్కర్మాచరణ వల్ల దురితక్షయమైతే ఈశ్వర భావనతో ఉపాసించటం మూలంగా విక్షేప దోషం తొలగిపోతే - రెండు విధాలా సంస్కారాన్ని పోగుచేసుకొన్న సాధకుడి మనోదర్పణం శ్రవణాది విచారానికి తప్పకుండా ఉన్ముఖమవుతుంది. అంటే ఏమన్న మాట. శమ దమాది రూపమైన కర్మయోగాన్ని అభ్యసించటంవల్ల కర్మ ప్రాబల్యం తలవంచితే శ్రవణం చేయటాని కవకాశం దొరుకుతుందని అర్థం.

   అయితే చాలామంది అస్తిక మహాశయుల కిది అర్ధం కాక కేవలం కర్మజడులై పోతున్నారు. దానికి కారణమిందులోని మెలకువ వారి కర్థం కాకనో - అయికూడా హఠబుద్ధి వదలకనో చెప్పలేము. యావజ్జీవమూ శ్రుతివిహితమైన అనుష్ఠాన మొకటి పాటిస్తే చాలు. అదే అన్నిటికీ జవాబు చెబుతుందని తాము భావించటమే కాదు. ఇతరులను కూడా అలాగే భావించమని బోధిస్తుంటారు. పైగా ఎవరైనా ఆ మార్గంలో లేకపోతే వారిని కర్మ భ్రష్టులనీ - వారి కిహపరాలు రెండూ లేవనీ శాపనార్ధాలు పెడుతుంటారు. ఇంతకన్నా అవివేకముండబోదు. ఇలాంటి వారంతా కర్మిష్టులే గాని కర్మయోగులు కారు. కర్మిష్ఠత కేవల మాచారం Ritualism క్రిందికే వస్తుంది. మతం Religion క్రిందికి రాదు. మతమనేది యోగం. యోగమంటే కలయిక. జీవుణ్ణి ఈశ్వరుడితో కలిపినప్పుడే కర్మ అనేది యోగమవుతుంది. అదే నిజమైన మతం. మత పర్యాయమైన Religion అనే ఆంగ్ల శబ్దానికి కూడా ఇదే అక్షరార్థం. Religo అనే ధాతువుకు కలపటమని అర్థం. భగవానుడే చెప్పాడసలు ఇలాంటి కర్మయోగమే నా మతమని. “యేమే మత మిదమ్ నిత్య- మనుతిష్ఠంతి మానవాః” నా మతాన్ని అనుసరించి నడచుకొనే వారంతా కర్మబంధం నుంచి బయటపడతారు. “యేత్వేత దభ్యసూయంతో - నాను తిష్ఠంతి మేమతమ్ - విద్ధి నష్టాన చేతసః” అలా కాక ఎవరు నా మతాన్ని నిర్లక్ష్యం చేసి అనుసరించరో వారంతా నష్టజాతకులే పొమ్మంటాడు.

   ఏమిటా భాగవతమైన మతమింతకు. ఈ కర్మయోగమే అదే అంతకు ముందు శ్లోకంలో మనకు తార్కాణ అవుతుంది.

Page 161