సగుణోపాసనాదులు చిత్తైకాగ్రాన్ని సమకూర్చాలని ఉపనిషత్తుల అభిప్రాయం. వీటి అడుగుజాడలలోనే పయనిస్తూ భగవద్గీత కూడా ఇదే రహస్యం మనకు బయట పెడుతున్నది. "స్వేస్వే కర్మణ్యభిరత- స్సంసిద్ధిమ్ లభతే నరః" ప్రతిమానవుడూ తనకు విహితమైన కర్మ లాచరిస్తూ సిద్ధి పొందుతాడట. కిమ్ స్వకర్మానుష్ఠానత ఏవ సాక్షాత్సం సిద్ధిః - స్వకర్మాచరణ మాత్రం చేతనేసిద్ధి కలుగుతుందా అని దీనిమీద ఆశంక చేసి భగవత్పాదులు దానికి సమాధానంగా ఉత్తర శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తారు. “యతః ప్రవృత్తి ర్భూతానామ్ యేన సర్వమిదమ్ తతమ్ స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిమ్ విందతి మానవః” దేనివల్ల ఈ సమస్త సృష్టి ఏర్పడిందో దేనిచేత మరలా వ్యాప్తమయి ఉన్నదో ఆ పరమాత్మ నారాధించటమే ఈ అనుష్ఠానమని భావిస్తూ చేయాలి కర్మ. అప్పుడే అది జ్ఞాననిష్ఠా యోగ్యతా లక్షణమయిన సిద్ధిని ప్రసాదిస్తుందని వివరిస్తారాయన.
ఆ మాటకు వస్తే గీత ఉపనిషన్మాత కంటే మరి రెండాకులెక్కువ చదివినట్టు తోస్తుంది. ఉపనిషత్తు శాస్త్ర చోదతమయిన కర్మలనే ఈ దృష్టితో చేయమంటే గీత ఒక శాస్త్రీయ కర్మలేగాదు. శారీరక లౌకిక కర్మలు యావత్తూ ఈశ్వరార్పణ దృష్టితోనే చేయటం మంచిదని సలహా ఇస్తున్నది. "కర్మణ్య కర్మయః పశ్యేత్" ఏ కర్మ చేస్తున్నా దానిలో అకర్మ రూపమయిన ఈశ్వర చైతన్యాన్నే చూడాలట. ఏ కర్మ అంటే ఏమిటా కర్మ. “పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ - అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్” కనటం వినటం దగ్గరి నుంచీ గాలి పీల్చటం దాకా - ఒకటేమిటి. మూత్రపురీ షోత్సర్గాదులతో సహా సమస్త కర్మలూ శుద్ధ చైతన్య భావనతోనే ఆచరిస్తూ పోవాలట జీవితంలో. ఇంతకన్నా సర్వాత్మ భావన మరేమున్నది. ఇలాంటి భావనతో Awareness చేసినప్పుడే శాస్త్రీయంగానీ లౌకికంగానీ కర్మానుష్ఠానమనేది నిజంగా మనకు శ్రేయోదాయక మవుతుంది. లేకుంటే కేవలం ప్రేయోదాయకమే.
దీనికే కర్మయోగమని పేరు పెట్టింది గీత. మనకు కర్మయోగం కావాలిగాని కేవల కర్మానుష్ఠానం కాదు. కేవలానుష్ఠానంలో ఈశ్వర భావన లేదు. ఆ భావన ఉంటే గాని సాధకుడి కహంతా మమతలు దూరంగావు. అవి దూరమైతే గాని సత్త్వం శుద్ధి గాదు. అందుకు తోడ్పడేది కర్మయోగమే సాధకుడికి. కర్మయోగం సత్త్వాన్ని శుద్ధి చేస్తే - సత్త్వ శుద్ధివల్ల జ్ఞానముదయిస్తే - తద్ద్వారా సమస్త కర్మలనూ
Page 160