అయితే అలా మళ్ళించినా అప్పుడపుడు శీతోష్ణాదులైన ద్వంద్వాలు మనమీద దాడి చేస్తుంటాయి. వాటి ధాటికి తట్టుకొని నిలబడాలి సాధకుడు. ఇలాంటి సహనశక్తికే తితిక్ష Endurance అని పేరు. ఇది శమాదిషట్కంలో నాలుగవది. దీని తరువాత శ్రద్ధ అని ఒక భూమిక ఉన్నది. శ్రద్ధ అంటే అలా అనాత్మ బాధలను సహించటమే గాక ఆత్మభావాన్ని అనుసరిస్తూ పోవటం. ఈ క్రియతో ఆత్మను పట్టుకొని దానిలోనే నిలిచిపోవటం ఆరవదైన సమాధి Absorp-tion or Trance. ఇది సాధన మార్గంలో కట్టకడపటి స్థాయి. దీనితో ఇంద్రియ శోధనమనేది సమాప్తమవుతుంది.
మొత్తం మీద శ్రవణాది విచార మార్గానికి దిగే ముందు దానికీ శుద్ధి రూపమైన పూర్వరంగం Preparatory ground సిద్ధం చేసుకొని ఉండాలి. అలా సిద్ధం చేసుకోమనే సాధకులకు బోధిస్తున్నది మహాభారతం. "కషాయసక్తిః కర్మాణి-జ్ఞానంతు పరమాగతిః కషాయే కర్మభిః పక్వే-తతో జ్ఞానమ్ ప్రవర్తతే" అన్నారు వ్యాస భట్టారకులు. కషాయమని ఒక దోషముంది మనకందరికీ. కషాయమంటే కర్మ జన్మమైన కాలుష్యం Contamination. అది బాగా పక్వం కావాలట. అంటే దాని వన్నె పూర్తిగా మారిపోవాలి. అలా మారాలంటే మొదటనే విచార మార్గానికి పూనుకొని ప్రయోజనం లేదు. అది పరమాగతిః - తరువాత కలగబోయే విషయం. పోతే దానికి ముందు చేయవలసిందేమిటని ప్రశ్న వచ్చింది. "కర్మాణి" అన్నారు. ఇంద్రియ పరిశోధనాత్మకమైన కర్మాచరణమే కర్తవ్యమని జవాబు. ఈ కర్మలచేత కషాయం పాకానికి వస్తే- "తతోజ్ఞానమ్ ప్రవర్తతే" పిమ్మట జ్ఞానా పర పర్యాయమైన శ్రవణాది విచారణ చక్కగా ముందుకు సాగుతుంది. ఇదీ మహాభారతంలో మోక్షధర్మ పర్వం మనకు బోధించే పరమ రహస్యం.
ఈ రహస్యాన్నే కఠోపనిషత్తులో సచికేతుడికి అధ్యాత్మ విద్య నుపదేశించే ఘట్టంలో యమధర్మరాజు కూడా ఆవిష్కరిస్తాడు. “నా విరతో దుశ్చరితాత్-నాశాంతో నా సమాహితః - నా శాంత మానసోవాపి - ప్రజ్ఞానేనైన మాప్నుయాత్” శాస్త్ర నిషిద్ధమైన దుష్కర్మ లాచరిస్తూ పోతే దానికి దుశ్చరిత Misdeed or Inequity మనిపేరు. అలాంటి దుశ్చరిత పంకం పేరుకొని ఉన్నంతవరకూ ఎంత మనం ప్రజ్ఞాబలంతో పట్టబోయినా ఆ తత్త్వాన్ని పట్టుకోలేము. అలాగే "నా శాంతః" అశాంతి అంటే ఇంద్రియ లౌల్య Indulgence మన్నారు భగవత్పాదులు.
Page 157