అలాంటప్పుడంత కన్నా ముందుగా మనం చేయవలసిన ప్రయత్నమొకటి ఉన్నది. అదే శమాది షట్క సంపాదన. ఆత్మజ్ఞానానికి శ్రవణాదులంతరంగ Internal సాధనమైతే ఈ శమాదులు బహిరంగ సాధన External మంటారు భగవత్పాదులు. జ్ఞానానికి సాక్షాత్తుగా తోడ్పడుతాయి శ్రవణాదులు. అవి బ్రహ్మ విచారమైనవి. కాబట్టి అంతరంగం దానికి. పోతే ఈ శమాదులలాంటివి కావు. ఇవి ఇంద్రియ సంస్కార Purifying రూపమైనవి. అంచేత దానికి బాహిరమిది. ఇంద్రియాలకే కరణమని మరి ఒక సంజ్ఞ. మనం కర్తల Agents మైతే - ఇవి మనకు కరణాలు Instruments వీటివల్లనే మనమే కర్మ అయినా చేయగలుగుతున్నాము. అయితే ఇవి బాగా పరిశుద్ధమై ఉండాలి. కాకపోతే శ్రవణాది క్రియలకివి అడ్డు తగులుతుంటాయి. అలా తగలటం వల్లనే మన మాశ్రవణాది సాధనకు నోచుకోలేకపోతున్నది. కాబట్టి మోక్ష సాధన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.
వీటిలో అంతఃకరణాలు కొన్ని. బహిఃకరణాలు కొన్ని. అంతః కరణాలు మనస్సూ-ప్రాణమూ, బహిః కరణాలు మనసుకు సంబంధించి త్వగాదులైన అయిదు జ్ఞానేంద్రియాలు. ప్రాణానికి సంబంధించి వాగాదులైన అయిదు కర్మేంద్రియాలు. ఇందులో జ్ఞానేంద్రియాలు వెలపలి వార్తలను లోపలి కందిస్తే - కర్మేంద్రియాలు లోపలి ఉత్తర్వులను వెలపలికి జారీ చేస్తుంటాయి. ఒకటి తెలుసుకోవటం. మరొకటి దాని కనుగుణంగా నడుచుకోవటం. మొదటి దాని కధ్యక్షపీఠం మనస్సయితే రెండవ దానికి ప్రాణం. ఇవి రెండూ కేవల మంతఃకరణాలు. ఇవి రెండూ శుద్ధి కావాలి ముందు. ఇవి శుద్ది అయితే ఆ తరువాత వాటి పరివారమే కాబట్టి చక్షురాదులు కూడా అవుతాయి. ఇందులో అంతరంగ శుద్ధికే శమమనిపేరు. చిత్తశుద్ధి కావచ్చు ఇది. ప్రాణశుద్దీ కావచ్చు. ఒకటయిందంటే మరొక దానికది దోహదం చేస్తుంది. పోతే ఇక బహిరింద్రియాలను వశీకరించే ప్రయత్నానికి దమమని పేరు. శమదమాలు రెండూ సాధించామంటే అంతరింద్రియ బహిరింద్రియ వర్గమంతా మనకు వశపర్తి అయిందన్నమాటే. ప్రతి ఒక్క ఇంద్రియ వ్యాపారమూ మన చెప్పుచేతలలో ఉంటుందప్పుడు. దీనితోప్రపంచ వ్యవహారాల నుంచి సాధకుడు తన మనస్సును సులభంగా మరలించుకో గలడు. ఈ మరలించుకోటానికే ఉపరతి With drawal అని పేరు.
Page 156