#


Back

   అదిప్రపంచం వైపు మనలను తీసుకెళ్తుంటే ఇది ఆ దారి మళ్ళించి మనలను మరలా మన ఆత్మ స్వరూపమైన బ్రహ్మతత్త్వం వైపు మోసుకొని పోతుంది. అదే ఇంతకు ముందు చెప్పిన శ్రవణమనన నిది ధ్యాసనారూపమైన అభ్యాసం.

   అయితే ఈ శ్రవణాదులు మాత్రం ఫలితమిస్తాయని ఏమిటి నమ్మకం. ఎంత కాలం శ్రవణం చేసినా అసలు విషయమంతా పట్టని వారెందరు లేరు. వారి విషయంలో మరి ఈ మానవ ప్రయత్నమేమయినట్టని ఒక ఆశంక వస్తుంది. దీనికికూడా పరిహారం చెప్పారు భాష్యకారులు. ఎంత అభ్యాసం చేసినా ఫలించకపోతే అప్పుడు మనం చేసుకొన్న కర్మవాసనలు మరీ ప్రబలంగా ఉన్నాయని అర్ధం చేసుకోవాలి. అలా ఉండటం మూలాన్నే శ్రవణాదులు చేయటానికి కూడా అసలు మొగ్గుచూప రనేకులు. "శ్రవణా యాపి బహుభిర్యో నలభ్యః" శ్రవణం చేయడానికే ఎంతో మంది నోచుకోలేదని చాటుతున్న దుపనిషత్తు. అంతేకాదు. "శ్రుత్వాప్యేనమ్ బహవో యేన విద్యుః" ఒకవేళ అలా చేయగలిగినా సుఖం లేదు. తరువాత దానిమీద మననం చేసి విషయాన్ని గ్రహించే తాహతుండదు వారికి అంచేత "ఆశ్చర్యోస్య వక్తా కుశలోస్య లబ్దా2_2. శ్చర్యోజ్ఞాతా కుశలాను శిష్టః" దాని ననుభవానికి తెచ్చుకొని బోధించేవాడూ అపురూపమే బోధిస్తే ఉన్నదున్నట్టు దాన్ని ఆకళించుకొనే వాడూ అపురూపమే నని కుండ బ్రద్దలు కొట్టినట్టు లోకానికి చాటి చెబుతున్నది శ్వేతాశ్వతరోపనిషత్తు. దీనిని బట్టి మనకు తేలిన రహస్యమేమంటే కర్మ ప్రతిబంధం కొంత తక్కువగా ఉంటే శ్రవణ మననాదుల కుత్సహించగలడనీ ఎక్కువ మోతాదులో ఉంటే మానవుడదీచేయలేడనీ అర్ధమవుతుంది.

   అయితే ఇది మనలను భయపెట్టి నిరుత్సాహ పరచటానికని మరలా అభిప్రాయ పడరాదు. భయపెట్టినట్టు కనిపిస్తున్నదే గాని ఇది శాస్త్ర తాత్పర్యం కాదు. శాస్త్రమిలా మాటాడటం మనం చేసే ప్రయత్నమెంత మందకొడిగా సాగుతున్నదో తెలపటానికే. అంతేగాదు. ఇతోధికమైన దీక్షతో మన ఉద్యమం కొనసాగించమని మనలను హెచ్చరించటానికి కూడా. ఒకవేళ దానికి కూడా తగినంత స్తోమత లేకపోతే శ్రవణాదుల కప్పుడే మనం పరిపక్వం కాలేదని అర్థం.

Page 155