ఇదుగో ఈ విధమయిన విమర్శకే Introspection పురుషకారమని Human effort పేరు. మరి దీనికి భిన్నమయిన కర్మ ఫలానుభవానికి దైవమని Destiny or Fate పేరు. వీటినే మనమిప్పుడు కర్మ సిద్ధాంతమనీ Fixed Fate పురుష ప్రయత్నమనీ Free will మామూలుగా లోకంలో వ్యవహరిస్తుంటాము. కొందరంతా కర్మాధీనమే నంటే - మరికొందరు మానవుడి ప్రయత్న లోపమేనని వాదిస్తుంటారు. రెండూ అతివాదాలే నంటారు భగవత్పాదులు. కర్మ కెంత ప్రభావమున్నా అది ఫలానుభవం వరకే. మహా అయితే రాగద్వేషాది ద్వంద్వాలను రెచ్చగొడుతుందది. అంతకు మించి మానవుడి వివేచన మీద కూడా అది చేయి చేసుకోలేదు. అందులో మానవుడికి వలసినంత వెసులు బాటున్నది. ఫలానుభవం ప్రయోగించిన బాణమైతే ఇది ఎక్కుపెట్టిన బాణం. కావలసివస్తే ప్రయోగించవచ్చు మనం. ఈ వివేచనలోనే ఉంది మన ప్రయత్నమంతా. ఇది ఇప్పుడు క్రొత్తగా చేస్తున్న కర్మ కాబట్టి దీనికి ప్రారబ్ధమడ్డు తగలదు. ప్రారబ్ధమంతకు ముందు చేసిన కర్మ. దానికీ దీనికీ సంబంధం లేదు.
అలా కాకపోతే మనమిక జీవితంలో ఏ కర్మగానీ చేయటానికి లేదు. ప్రతి ఒక్కటీ ప్రారబ్ధ తంత్రమనే గదా చెబుతున్నారు మీరు. అంతా ప్రారబ్ధాధీనమే నన్నప్పుడొక ప్రశ్న వస్తుంది. అసలీ ప్రారబ్ధమనేది ఎలా ఏర్పడిందని ఇంతకు ముందు జన్మలో మనం కర్మ అనేది చేసి ఉంటేనా గదా అది ఏర్పడింది. అంతకు ముందు చేస్తేనే గదా. కాబట్టి కర్మ చేసుకొనే స్వాతంత్య్రం మానవుడి కెప్పుడూ ఉందనే అర్ధం. ఒకప్పుడు చేస్తేనే అది ఇప్పుడు ప్రారబ్ధమయింది మన పాలిటికి. అలాంటప్పుడీ జన్మలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ కర్మచారణ శక్తి ఎలా అంతరించి పోతుంది. తప్పకుండా ఉండవలసిందే. అలా ఉండటం చేతనే దాని నుపయోగించుకొని మరలా ప్రయత్నం చేయవచ్చు మానవుడు. దానినే మనం పురుష ప్రయత్నమని పేర్కొంటున్నాము. ప్రారబ్దం మనలనుకట్టి పడేస్తుంటే ఇది దాని కట్లు విప్పుకొనే ప్రయత్నం. అది సమస్య అయితే ఇది పరిష్కారం. సమస్యలోనే దాగి ఉంటుంది దాని పరిష్కారం కూడా. దొంగను పట్టటానికి దొంగే కావాలన్నట్టు కర్మను నిర్మూలించేది మరలా కర్మే. మొదటి కర్మ ప్రారబ్దం. రెండవ కర్మ ప్రయత్నం.
Page 154