ఎందుకంటే గడచిపోయిన విషయమది. అనేక జన్మల నుంచీ చేసుకొంటూ వచ్చిన కర్మ ఫలమే ఇప్పుడనుభవిస్తున్నాము. అది చేయి జారిన విషయం కాబట్టి ఆ కర్మఫలంగా ఏర్పడిన ఈ జన్మలో ఎప్పుడేది ప్రాప్తించినా అది నోరు మూసుకొని అనుభవించవలసిందే. తప్పదు. ఇదుగో ఈ ఫలానుభవం వరకూ దాని ప్రభావమే. అందులో మన ప్రయత్నమేమీ పనిచేయదు.
అయితే అది అక్కడికే పరిమితం. అంతకు మించి ప్రవర్తించే అధికారం దానికి లేదు. అంతకు మించి ఏముందని అడగవచ్చు. మానవుడికి భోక్తృత్వమేగాక కర్తృత్వం కూడా ఉందనే సంగతి మనం మరచిపోరాదు. జీవుడు కర్తా-భోక్తా కూడా నని గదా ఇంతకు ముందు మనం ప్రతిపాదించాము. అందులో భోక్తృత్వ లక్షణముండటం వల్లనే కర్మఫలమనుభవిస్తుంటాడు. అక్కడ అతని ప్రయత్నమేదీ పని చేయని మాట వాస్తవమే. కానీ దానితో పాటు కర్తృత్వమనే రెండవ లక్షణం కూడా ఉంది గదా. కాబట్టి ఒకవైపు కర్మఫల మనుభవిస్తూనే ఇంకొక వైపు మరలా కర్మ చేస్తుంటాడు. ఈ చేసే కర్మలో మాత్రమతనికి కావలసినంత అవకాశముంది. అందులో ఆ ప్రారబ్ద కర్మ కెంత మాత్రమూ ప్రవేశం లేదు.
ఇందులో ఉన్న రహస్యమేమంటే కర్మ అనేది బహుజన్మల నుంచీ సంస్కార రూపంగా Instinct మన స్వభావంలో జితించిపోయింది. ఆ సంస్కారాలతోనే మనమిప్పుడు జన్మించాము. అది జారీ కావటంవల్లనే జన్మ ఎత్తాము కాబట్టి ప్రయోగించిన బాణం లాంటిదది. దశరథుడి లాగా ఇక ఎంత తాపత్రయపడ్డా దాన్ని వెనుకకు తీసుకోలేము. మంచో చెడో దాని ఫలితమది ఇవ్వవలసిందే తప్పదు. పోతే ఇప్పుడు మనం మరలా చేసుకొనే కర్మ అలాంటిది గాదు. ఇది ఎక్కుపెట్టిన బాణమంటారు భగవత్పాదులు. దీన్ని మనం విడిచినా విడవవచ్చు. ముడిచినా ముడవవచ్చు. మనచేతిలో ఉందది. అయితే కర్మకే వదిలేస్తే అది విడవమనే చెబుతుంది. ఎందుకంటే మనసులో తిష్ఠ వేసుకొని కూచున్నాయి ప్రాక్తన కర్మవాసనలు. అవి సమయం చూచి రాగద్వేషాలను రెచ్చగొడుతాయి. రాగద్వేషాదులు తమ కనుకూలంగా మన బుద్ధులను త్రిప్పటానికి ప్రయత్నిస్తాయి. అదుగో అప్పుడే మనం జాగ్రత్త పడాలి. మంచి చెడ్డలు బాగా విమర్శించి చూచి అది ఉపాదేయ Preferable మయితే ఆచరించాలి. హేయ Deferable మని తోస్తే త్రోసి వేయాలి. ఈ హానోపాదానాలు మాత్రం మన చేతిలోనే ఉన్నాయి.
Page 153