#


Back

   అందులో పదిసార్లు దంచింది శ్రవణమైతే వందసార్లు మననమైతే- వెయ్యిసార్లు నిది ధ్యాసనం. మూడూ కలిసి ఇచ్చే ఫలితం చివరకు బియ్యమే. కొంచెమో గొప్పో అది ప్రతి ఒక్కటీ వాటిలో సాధిస్తూనే ఉన్నది. తండుల నిష్పత్తి పూర్తి అయ్యేసరి కందులోనే మూడూ సమాప్తమవుతాయి. అలాగే ఈ శ్రవణాదులు మూడూ కూడా కొంతకు కొంత సాధిస్తూ చివర కాబ్రహ్మ జ్ఞాన నిష్పాదనంలోనే చరితార్ధమవుతాయని పరమ హంసలమాట. అయితే అలా చరితార్ధం Culminate కావాలంటే కర్మ అనే ప్రతిబంధమున్నంత వరకూ లాభం లేదు. కాబట్టి ఒక ప్రక్క దాన్ని నిర్మూలిస్తూనే మరొక ప్రక్క ఇవి బ్రహ్మజ్ఞానానికి తోడ్పడుతాయని అర్ధం చేసుకోవాలి మనం.

   అయితే శ్రవణాదులు బ్రహ్మజ్ఞానాని కుపాయమని చెబుతున్నారు. బాగానే ఉంది కాని కర్మ అనేది నిర్మూలనమైతే గదా అవి మన జ్ఞానానికి తోడు పడేది. జీవితమంతా ప్రారబ్ధానికే అధీనమై ఉన్నప్పుడీ శ్రవణాదులకు మాత్రమవకాశ మెక్కడిది. ఒక ఒరలో రెండు కత్తులిముడలేవు గదా. ఇందులో మొదట ప్రవేశించిన కత్తి కర్మవృత్తి అయి కూచుంది. మరి జ్ఞానమనే మరోకత్తి దానిలో ఎలా ప్రవేశించగలదు. అది ఉంటే ఇది లేదు. ఇది ఉంటే అది లేదు. ఇందులో అది ఉందనే విషయం మన కనుభవ సిద్ధమే. కర్మఫలమే గదా జీవితాంతమూ మనమనుభవిస్తున్నాము. పోతే జ్ఞానమనేదే మనకు అందని మ్రానిపండయింది. అలా అయిందంటే అప్పటికీ ప్రారబ్దం దాన్ని తల ఎత్తనివ్వటం లేదనే గదా అర్థం. అలాంటప్పుడిక జ్ఞానం కోసమే ప్రయత్నం గానీ ఎలా చేయగలడు మానవుడని ఆక్షేపణ వస్తుంది.