#


Back

   ఇదుగో ఈ నిష్ఠకే నిది ధ్యాసన Realisation మని పేరు. దీనివల్ల విపర్యయమనే మూడవ దోషం కూడా పోతుంది. అప్పుడిక లోపలా వెలపలా -సమాధీవ్యుత్థానమనే తేడా లేకుండా నిరంతరమూ బ్రహ్మదృష్టిలోనే ఉంటాడు సాధకుడు. అలా ఉంటే లోకవ్యవహారమంతా ఇక వాడికి బ్రహ్మాకారంగానే మారి కనిపిస్తుంది. దీనినే వర్ణిస్తూ భగవత్పాదులిలా వ్రాస్తారు. “యత్పశ్యతి-యచ్ఛృణోతి - స్పృశతివా తత్సర్వమ్ వాసుదేవ ఏవేతి గ్రహావిష్ట బుద్దిః" ఏదేది లోకంలో చూస్తామో వింటామో-స్పృశిస్తామో-అంతెందుకు. మన సకలేంద్రియాలతో ఏదేది గ్రహిస్తామో-అదంతా ఆయారూపాలలో గాక ప్రతి ఒక్కటీ బ్రహ్మమేననే ఏకాత్మ భావంతో దర్శించాలి-అది ఎప్పుడూ ఒక గ్రహంలాగా మన బుద్ధి నావేశించి ఉండాలంటా రాయన.

   మొత్తంమీద శ్రవణాదులైన ఈ మూడుపాయాలే చాలు. అవి అభ్యస్తమయ్యే కొద్దీ కర్మ ప్రతిబంధాన్ని క్రమంగా రూపుమాపి సాధకుడి మనోదర్పణాన్ని నిర్మలం చేస్తాయి. “తద్బుద్ధయ స్తదాత్మాన - స్తన్నిష్ఠాస్త త్పరాయణాః గచ్చం త్యపునరావృత్తిమ్ జ్ఞాననిర్ధూత కల్మషాః" అని భగవత్ప్రబోధం. ఇందులో తద్బుద్ధి అంటే శ్రవణం. తదాత్మత్వమంటే అది తప్ప మరేదీ లేదనే భావన మననం. పోతే తన్నిష్ఠ అనేది నిది ధ్యాసనమే. ఈ మూడింటి జ్ఞానంవల్లా కర్మ నిర్మూలనం జరిగితే అది జ్ఞాన నిర్ధూత కల్మషత్వం. తద్వారా తదేక పరాయణత్వంతో అపునరావృత్తి రూపమైన మోక్షఫలాన్ని హస్తగతం చేసుకోగలడు సాధకుడని దీని తాత్పర్యం.

   మూడింటి జ్ఞానమూ నన్నప్పుడివి మూడూ దేనిపాటికది వేరుపాటు వాదులని మరలా భావించరాదు. మూడు కలిసి కలిసికట్టుగా సాధించే పని ఒక్కటే. అది సర్వమూ ఆత్మ స్వరూపమే ననే ఏకాత్మ భావం The subjective unity of all. కేవలమూ ఆ భావాన్ని దృఢీకృతం చేయటంలోనే తేడా. కనుక ఇవి మూడూ మూడు మార్గాలు కావు. ఒకే ఒక మార్గంలో మూడు భూమిక Stages లంటారు భగవత్పాదులు. ఎందుకంటే మూడూ కలిసి చివరకు మనకిచ్చే అనుభవం ఒక్కటే. శ్రవణమిచ్చినా అదే. మననమిచ్చినా అదే. నిదిధ్యాసనమైనా అదే. వడ్లదంపకం లాంటిదీ వ్యవహారమంతా. వడ్లు బియ్యం కావాలంటే దంచటమే దాని కుపాయం. అయితే ఎన్నిసార్లు దంచాలని ప్రశ్న. ఇన్నిసార్లనే నియమం లేదు. బియ్యం కావటమే మాకు కావలసింది. అది ఎన్ని సార్లకయితే అన్నిసార్లని జవాబిస్తారు శంకరులు.

Page 151