ఒక రజ్జువు సర్పం మాదిరి భాసించటంలేదా. అలాంటిదే ఇదీ. ఇలా ఆభాస అని ఎప్పుడు తేల్చుకొన్నామో అప్పుడది ఆ వస్తువుకన్నా భిన్నంగాదని ఆకళింపుకు తెచ్చుకోవాలి. రజ్జువు కంటే వేరుగా సర్పమెక్కడ ఉంది. అలాగే ఆ బ్రహ్మచైతన్యం కన్నా ఈ జ్ఞేయ ప్రపంచం కూడా వేరుగా లేదెక్కడా. ఎంచేత. ఆది మధ్యావసానాలలో దాన్నే ఇది అంటి పట్టుకొని ఉన్నది. అలా ఉన్నదంటే ఇది దానికి విభక్తం కాదు. విభక్తం కాదంటే అదేనని భావం. ఇలా సహేతుకంగా విచారణ సాగిస్తే చాలు. ఈ ప్రపంచమెంత సవిశేషంగా కనిపిస్తున్నా- ప్రతి ఒక్కటీ చైతన్యాన్ని విడిచి ఉండలేదు కాబట్టి చైతన్యం చేతనే భాసించాలి కాబట్టి మన చైతన్యమే పరచినట్టు సర్వత్రా మనకు ప్రత్యక్షమవుతుంది. అప్పుడిక ప్రపంచమనే వార్తలేదు. అంతా కలిసి ఒకే ఒక బ్రహ్మచైతన్యమనే భావం మనసుకు వస్తుంది. దానితో సంశయ పిశాచం కూడా ఉచ్చాటనమయి పోతుంది.
అయితే సంశయం పోవచ్చు. కేవలం బ్రహ్మమే ఉందనే నిశ్చయజ్ఞానమూ Conviction కలగవచ్చు. కానీ అది ఎంత జ్ఞానమైనా మానసికమే. మరి మానసికంగా ఎంత నిశ్చయం చేసుకొన్నా-బాహ్యంగా మరలా ఈ ప్రపంచంలో వ్యవహరిస్తుంటాము గదా. ప్రపంచమనేది లేకపోతే దానితో ఎలా వ్యవహరించగలం. కాబట్టి బ్రహ్మాకార మయిన జ్ఞానముదయించినా ఇంకా భౌతికమైన ప్రపంచమున్నది. ఇలా ఉంటే ఆ జ్ఞానమఖండమెలా అయిందని మరలా ఒక ఆశంక. దీనికే విపర్యయమని పేరు. విపర్యయమంటే వస్తువనేది ఏకమని నిర్ధారణ చేసుకొన్నా - అది మళ్ళీ అనేకంగా భాసించటం. వాస్తవానికి బ్రహ్మానికి భిన్నంగా లేదు ప్రపంచం అయినా భిన్నంగా కనిపిస్తున్నది. అలా కనిపిస్తున్నదంటే మనం మానసికమైన అభేద వృత్తిని సాధించామే గాని-దానినే అనుక్షణమూ పట్టుకొని కూచోటంలేదు. ఎప్పుడెప్పుడు పట్టుజారుతుందో అప్పుడంతా మరలా ఈ ప్రపంచ దృష్టి వచ్చి మధ్యలో చోటు చేసుకొంటుంది. అది విజాతీయ భావం Hetero geneous Element విజాతీయమైన భావమేర్పడిందంటే సజాతీయమైన Home geneous బ్రహ్మభావం తాత్కాలికంగా దూరమయిందనే గదా. కనుక విజాతీయం చేత ఏ మాత్రమూ తిరస్కృతం Veiled కాని కేవల సజాతీయ దృష్టినే ప్రవాహరూపంగా సాగిస్తూ పోవాలి సాధకుడైన వాడు. అది కేవల జ్ఞానం కాదప్పుడు. జ్ఞాననిష్ఠ Stability అవుతుంది.
Page 150