#


Back

   ఇలాంటి స్వరూపాన్ని వాక్యమెప్పుడు వర్ణించిందో అప్పుడా పదార్థం తాలూకు వృత్తి ఒకటి చిత్తంలో నిష్పన్నమవుతుంది. దీనినే బ్రహ్మాకారవృత్తి అని ఇంతకుముందు మనం పేర్కొన్నాము. ఇది వాక్యార్థాన్ని యథావిధిగా శ్రవణం చేయటంవల్ల మనకేర్పడే వృత్తి. వృత్తి అన్నా జ్ఞానమన్నా విద్య అన్నా వివేకమన్నా కూడా ఇదేనని చెప్పాము. దీని మూలంగా మొదటి నుంచీ మన చిత్తంలో పేరుకొని పోయిన అజ్ఞానమనే చెత్తదూరంగా తొలగిపోతుంది. అజ్ఞానమంటే ఈ ప్రపంచమే తప్ప దీనికి మూలభూతమైన తత్త్వమొకటి ఉందని తెలియకపోవటం. ప్రస్తుతమలాంటి పదార్థమొకటి ఉంది – ఫలానా విధంగా ఉందని శ్రవణం చేయగానే తదాకారమైన జ్ఞానముదయించి అది అజ్ఞాన తిమిరాన్ని పారదోలింది. తత్ఫలితంగా అద్వితీయమైన జ్ఞానమే బ్రహ్మమనే ఒక అఖండాత్మ భావం మనసులో చోటు చేసుకొంటుంది.

   కాని ఈ జ్ఞానంవల్ల బ్రహ్మవిషయమైన అజ్ఞానమనేది తొలగిపోయినా సంశయమనే మరొక భూతం మనల నావేశిస్తుంది. సంశయం దేనికని అడగవచ్చు. బ్రహ్మమంటే జ్ఞానస్వరూపమనితెలుసుకొన్నాము. అంతవరకు బాగానే ఉన్నది. కాని అది అద్వితీయమని చాటారే అది ఎలా చెల్లుతుందని సందేహం. ఎందుకంటే అద్వితీయ మన్నప్పుడిక దానికి భిన్నమైన భావమే గోచరం కాగూడదు. అయినా ఈ ప్రపంచం మనకెప్పుడూ గోచరిస్తూనే ఉన్నది. అలాంటప్పుడది అఖండమనే మాట కర్థమేముంది. ఇదుగో ఈ సంశయాన్ని నివారించటానికే శ్రవణం తరువాత మననమనే రెండవ భూమిక. మననమంటే విచారణ Reflection అని అర్థం. హేతు దృష్టాంత Argument & Illustration రూపంగా సాగుతుందది. ఆగమార్ధాన్ని శ్రవణం Leaming చేసిన తరువాత దాని నీహేతు దృష్టాంతాలతో సమర్ధించవలసి ఉంటుంది మనం. లేకుంటే ఆ చెప్పింది ఎలా చెల్లుతుందా అనే సందేహమెప్పటికీ తీరదు మనకు. ప్రస్తుతం మనకు పట్టుకున్న సందేహమేమిటి. జగత్తనేది ఒకటి కనిపిస్తున్నది గదా - ఇది ఉండగానే ఆ బ్రహ్మ మద్వితీయమెలా అయిందని. ప్రపంచమనేది కనిపిస్తున్నా అది వస్తువు Fact గాదు కేవలమొక వస్తువు తాలూకు ఆభాస Reflection అనిముందు తెలుసుకోవాలి మనం. ఆ వస్తువు ప్రజ్ఞాన రూపమైన బ్రహ్మమే. అదే జ్ఞేయరూపమయిన ప్రపంచంలాగా భాసిస్తున్నది.

Page 149