కనిపించటం లేదు గదా - ఉందని ఎలా చెప్పగలవని శంకించవచ్చు. కనిపించకపోయినా ఈ కనిపించే ప్రపంచానికంతటికీ అది మూలం. దానిమీద ఆరోపితమైనదే ఈ జగత్తంతా. ఆరోపితమైన జగత్తే మనముందని చూస్తున్నప్పుడు దీని కాధారమైన మూలతత్త్వమెలా లేకపోతుంది. అదే లేని నాడీ జగత్తు దేనిమీద ఆరోపితమయినట్టు. ఆరోపణ అన్నప్పుడు దానికొక అధిష్ఠానమనేది ఉండాలి గదా. అధిష్ఠానమే లేదంటే దానిపైన ఆరోపితమైన పదార్ధం కూడా లేనిదే కావాలి. కాని లేదని చూడటం లేదు మనమీ ప్రపంచాన్ని. ప్రతి ఒక్క పదార్ధాన్నీ లోకంలో ఉన్నది - ఉన్నదనే చూస్తున్నాము. ప్రపంచమున్నదంటే అప్పటికీ తదాధారమైన బ్రహ్మం కూడా ఉండవలసిందే గదా. అంచేత బ్రహ్మమనేది సత్యం.
దీనితో మనకీ కనిపించే ప్రపంచమే గాక దీని కతీతంగా మరి ఒక పదార్ధం కూడా ఉందని బోధపడింది. అయతే ఆ పదార్థమెక్కడా కనపడటం లేదే. ఎక్కడ ఉన్నట్టది అనిమరలా ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానమే. జ్ఞానమనే రెండవ మాట. జ్ఞానమనే సరికది ఇక మనకు జ్ఞేయం కాదని తేలిపోయింది. జ్ఞేయం కాదు గనుకనే మిగతా పదార్ధాల మాదిరి మనకది ఎక్కడ వెదకినా కనిపించదు. కనిపించవలసింది ఏదైనా జ్ఞానానికేగదా. అలాంటి జ్ఞానమే అదయినప్పుడిక కనిపించే ప్రశ్నేముంది కాబట్టి మన జ్ఞానానికి కనిపించేది కాదది - మన జ్ఞానమే.
జ్ఞానమే ననే సరికది మరలా పరిచ్ఛిన్నమైన తత్త్వమేమోనని ఒక అపోహ కలగవచ్చు. అలాంటి అపోహను నివారించటానికే అనంతమనే మరొక విశేషణం ప్రయోగించవలసి వచ్చింది. మన జ్ఞానం జ్ఞానమే అయినా అది సొంతమేగాని అనంతం గాదు. అనంతమంటే అంతం లేనిదని అర్ధం. ఇంకొక పదార్థమున్నప్పుడే అంతమనేది ఏర్పడుతుంది. అలా కాక ఒకే పదార్థమున్నదంటే ఇక దానికంతం లేదు. ప్రస్తుతం మనకున్న జ్ఞానమొకే ఒక పదార్థం కాదు. దానికి నిత్యమూ జ్ఞేయభూతమైన ఈ ప్రపంచం కూడా ఒకటి కనిపిస్తున్నది. ప్రపంచమనే వేరొక పదార్థమెప్పు డేర్పడిందో అప్పుడా మేరకిది పరిచ్ఛిన్నం కాక తప్పదు. కాబట్టి అస్మదాదులది సాంతమైన జ్ఞానం. ఇలా సొంతమైన జ్ఞానం కాదది. అనంతమనిగదా పేర్కొన్నాము. అనంతం గనుకనే జ్ఞేయ ప్రపంచ వాసన కూడా లేని అఖండంగా వ్యాపించిన కేవల జ్ఞాన స్వరూపమే ఆ బ్రహ్మమని తేలుతున్నది.
Page 148