#


Back

   అయితే నాకీ పనికిమాలిన ఆస్తిదేనికి ఆత్మదర్శనానికి సాధనమేదో దానినే బోధించి పొమ్మని ప్రాధేయపడిందావిడ. అప్పుడాయన చెప్పిన మాటలే “శ్రోతవ్యో-మంతవ్యో-నిదిధ్యాసితవ్యః” అనే మూడు మాటలూ. ఈ మూడింటికే శ్రవణ మనన నిదిధ్యాసనలని వ్యవహారం. “ఆత్మావారే ద్రష్టవ్యః" అమృతత్త్వాన్ని పొందాలంటే ఆత్మదర్శనం చేసుకోవాలి మానవుడు. అదే జీవిత పరమార్థం. అయితే అది ఎలా ప్రాప్తిస్తుంది మనకు. శ్రోతవ్యః - మొదట శ్రవణం చేయాలి. మంతవ్యః తరువాత మననం చేయాలి. నిదిధ్యాసితవ్యః ఆ పిమ్మట తదేక దృష్టితో ధ్యానంచేయాలి. శ్రవణాదులైన ఈ మూడు ఆచరిస్తే మనసులో పేరు కొనిపోయినకర్మమాలిన్యాన్నంతా అది కడిగి వేస్తుంది. దానితో మనోదర్పణం పరిశుద్దమయి చక్కగా ప్రకాశిస్తుంది. అప్పుడా మనసుకు తత్త్వమస్యాది వాక్యముపదేశిస్తే చాలు. కర్మ ప్రతిబంధమేదీ లేదు కాబట్టి వెంటనే దాని జ్ఞానాన్ని అది తప్పక ప్రసాదిస్తుంది. అంచేత కర్మ ప్రాబల్యమంత ఉన్నా శ్రవణాదుల నభ్యసిస్తూ పోతే దాన్ని నిర్మూలించి మనకు ఆత్మజ్ఞానాన్ని కూడా నిర్విఘ్నంగా ప్రసాదించగలదు.

   అయితే ఈ శ్రవణాదికమే సాధనమన్నప్పుడు వాటి స్వరూపమేమిటి. తన్మూలంగా కర్మబంధం తొలగి మనకు బ్రహ్మజ్ఞానమెలా భాసిస్తుందని ప్రశ్న. శ్రవణమనన నిది ధ్యాసనలనే మూడింటిలో శ్రవణమనేది మొట్టమొదటిది. శ్రవణమంటే వినడమని శబ్దార్ధం. ఉపనిషత్తులు బోధించే తత్త్వమస్యాది వాక్యాలను తొలుతగా మనం వినవలసి ఉంది. అవి బోధించే వాక్యాలన్నీ బ్రహ్మ స్వరూపాన్ని వర్ణించేవే. ఆ వాక్యాలు మన చెవినబడనంత వరకూ మనకు బ్రహ్మమనే పదార్థమొకటి ఉన్నదని తెలియదు. మనకు తెలిసినదల్లా మనచుట్టూ ఉన్న ఈ ప్రపంచమే. ఇది ఆబాల గోపాలమూ మన కనుభవ సిద్ధమే కాబట్టి కలదో లేదో అనే సందేహమక్కర లేదు. పోతే సందేహమంతా దీనికతీతంగా ఉందని వర్ణించే ఆ బ్రహ్మతత్త్వంలోనే మనకు. అది ఈ ప్రపంచంలాగా ప్రత్యక్ష గోచరం కాదు కాబట్టి సహజంగా అనుమానిస్తాము. ఇలాంటి అనుమానం మొదట మనకు లేకుండా చేయాలి వాక్యం.

   అందుకే "సత్యమ్-జ్ఞాన- మనంతమ్ - బ్రహ్మ” అని బ్రహ్మతత్త్వాన్ని వర్ణిస్తుందుపనిషత్తు. ఇందులో సత్యమనే మాట వినగానే బ్రహ్మమనే పదార్దమొకటి ఉందని మొదట మనకర్థమవుతుంది.

Page 147