#


Back

   ప్రారబ్దమొకటి పని చేస్తున్నంత వరకూ మానవుడి మనసు బాహ్య ప్రపంచం మీదకే పోతుందిగాని బ్రహ్మతత్త్వం మీదికి ప్రసరించదు. ప్రసరించకపోతే తద్విషయమైన జ్ఞానం మనకెలా ఉదయిస్తుంది. కాబట్టి జీవితంలో బ్రహ్మానుభవం కలగలేదంటే దానికీ జీవులు చేసుకొన్న కర్మే తప్ప మరేదీ కాదని తీర్మానించారు. వేదాంతులు.

   అయితే ఇది ఇంతేనా-దీనికిక పరిష్కారమే లేదా-అని మరలా ప్రశ్న వస్తుంది. పరిష్కారం లేకపోలేదు. లేకుంటే అసలీ శాస్త్రాలూ-ఆచార్యులూ-వారి ఉపదేశమూ అంతా అర్ధం లేని ప్రసంగమే అవుతుందన్నారు భాష్యకారులు. ఎంచేతనంటే ప్రారబ్ధకర్మ లేనివాడెవ్వడూ లేడు ప్రపంచంలో. ప్రారబ్ధంవల్లనే గదా ఈ జన్మమనేది సంప్రాప్తమయింది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ప్రారబ్దమున్నది. అది ఉన్నదంటే ఇక జ్ఞానాని కవకాశమే లేదు గదా. అలాంటప్పుడీ వేదాంత శాస్త్ర మెవరికని. ఎవరికీ గాకపోతే ఎవడూ ప్రయత్నించేదిలేదు. మోక్షమనేది సిద్ధించేది లేదు. చావుకబురు చల్లగా చెప్పినట్టు ఈ మాట చెప్పడానికే అయితే ఇంత పెద్ద కంఠశోష దేనికి. అంచేత దీనికేదో ఒక పరిష్కారముండి తీరాలి. ప్రతిబంధకముందంటే దాన్ని తొలగించుకొనేది ఉపాయం కూడా ఉండకపోదు. అదుగో ఆ ఉపాయం మనకు తెలియజెప్పటానికే శాస్త్రమనేది అవతరించిందసలు.

   మరి శాస్త్రం మనకు బోధించే ఆ ఉపాయమేమిటని అడిగితే అది ఏదోగాదు. శ్రవణ మనన నిదిధ్యాసలే ఆ ఉపాయమన్నారు భగవత్పాదులు. బృహదారణ్యకంలో, యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య మైత్రేయికి బోధించిన ఉపాయమదే. యాజ్ఞవల్క్యుడికిద్దరు భార్యలు. ఒకతి కాత్యాయని. మరొకతె మైత్రేయి. వారిలో కాత్యాయని స్త్రీ ప్రజ్ఞా మాత్ర పర్యవసిత అయితే- మైత్రేయి బ్రహ్మవాదిని. ఒకనాడా మహర్షి సన్న్యాసం పుచ్చుకొని అరణ్యానికి వెళ్ళబోతూ చిన్న భార్య అయిన మైత్రేయిని పిలిచి నేను సన్న్యసించి వెళ్ళుతున్నాను- మీ ఇద్దరికి నా ఆస్తిసమానంగ పంచి ఇస్తాను - అది పెట్టుకొని సుఖంగా బ్రతకండని చెప్పాడట. దాని కావిడ ఏమండీ! మీరు పంచిపోయే ఈ ఆస్తివల్ల నా కమృతత్త్వమనేది సిద్ధిస్తుందా అని అడిగిందట. అతడామాటకు నవ్వి ఓసి పిచ్చిదానా! ఆస్తులవల్ల అమృతత్త్వం సిద్ధించటమేమిటి అది ఒక్క ఆత్మదర్శనం వల్ల మాత్రమే మనకు దక్కుతుందని చెప్పాడట.

Page 146