అయితే ఈ కర్మ ఏమిటి - అది మన జ్ఞానాని కడ్డు తగలటమేమిటని ఇప్పుడు ప్రశ్న. అది కూడా ఇంతకు పూర్వమే కొంత ప్రస్తావన చేసి ఉన్నాము. కర్మ అంటే మనం చేసే పనులే. మనోవాక్కాయాలనే త్రికరణాలతో Instruments మనమెప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఏ పనీ చేయకుండా ఒక్క క్షణకాలం కూడా ఊరక కూచోలేము. ఆఖరుకు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలైనా ఆడుతుండవలసిందే. ఇలా చేస్తూ పోయే కర్మలన్నీ కేవలం చలనాత్మకాలే కాబట్టి వాటిని మనం పట్టించుకోకపోతే ఏమీ చేయవు. ఎప్పటికప్పుడు సమసిపోతాయి. కాని మనమలా పట్టించుకోకుండా ఉండలేము. ఉండక ఏమి చేస్తున్నాము. ఈ పని నేను చేస్తున్నానని ఒక కర్తృత్వ బుద్ధి - దీనివల్ల ఈ ఫలితం పొందాలని ఒక భోక్తృత్వ బుద్ధి పెట్టుకొంటాము. అది వెంటనే మన మనసులో ఒక వాసనా రూపంగా Impression పరిణమిస్తుంది. ప్రతి క్రియకూ Action ఒక ప్రతిక్రియ Reaction ఉండి తీరుతుందనే గదా ప్రతిపాదించాము. ఆ ప్రతిక్రియే వాసన అంటే. ఈ వాసనలే లేవు పొమ్మంటే సృష్టి వైషమ్యానికీ - వైచిత్ర్యానికీ జవాబు చెప్పుకోలేము. కాబట్టి వాసన లేర్పడటమనేది తథ్యం. ఈ వాసనా ముద్ర ఎప్పుడేర్పడిందో అప్పుడిక అది మనలను శాశ్వతంగా అంటి పట్టుకొంటుంది. శరీర పాతమయినా తొలగిపోదు. శరీరం పోయినప్పటికీ జీవులమైన మనముంటాము గదా. మనముంటే మనతోపాటు మన కర్మవాసనలూ ఉండనే ఉంటాయి. ఏదీ కనపడలేదే అని వాదించరాదు. ప్రతి ఒక్కటీ మనకు కనపడదు. మన ప్రాణమూ మనస్సూ కనపడుతున్నాయా మనకు. అదృష్ట రూపంగా ఉన్నాయవి. అలాగే ఈ కర్మవాసనలు కూడా అదృష్ట రూపంగానే ఉంటాయి. ఎన్ని జన్మలకైనా అప్పు తీర్చినట్టు వాటి ఫలితం మన మనుభవించి తీరవలసిందే. తప్పదు. "యుగ సహస్ర కోట్యం తరితాపిజంతో ర్యాపురా భావితా వాసనా - సాన వినశ్యతి” అంటారు భగవత్పాదులు. కొన్ని కోట్ల జన్మలెత్తినా సరే. అనాది నుంచీ భావితమయిన వాసనలు నశించే ప్రశ్నేలేదట. ఇంగువ కట్టిన వస్త్రమది. ఇంగువంతా ఖర్చయినా అదృశ్యంగా దాని వాసన ఎక్కడో దాన్ని ఆశ్రయించే ఉంటుంది. అలాగే మనల నాశ్రయించిన ఈ వాసన కూడా. అందుకే దీనికసలు వాసన అనే పేరు వచ్చింది. సంస్కారమని కూడా దీనికే పేరు.
Page 144