#


Back

   క్రిందటి రెండధ్యాయాలలో సాధన మార్గాన్ని గూర్చి సవిస్తరంగా చర్చించాము. అందులో మొదటిది జ్ఞానమే మోక్షసాధనమని నిరూపిస్తే- రెండవది ఆ జ్ఞానం మోక్షానికెలా సాధనమో ఆ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. ఈ రెంటివల్లా మనకు జ్ఞానమనేది కలిగితే చాలు ఆ జ్ఞానమే అనుభవమని కూడా గ్రహించాము మనం. అలాంటప్పుడీ బోధన విన్న ప్రతి ఒక్కడికీ బ్రహ్మజ్ఞానమనేది కలగవలసిందే గదా. ఏదీ లోకంలో ఎవడికీ అలా కలుగుతున్నట్టు దాఖలాలేదే. నూటికి కోటికొక్కడికి కలిగితే ఎక్కువ వాడయినా ఉన్నాడో లేడో మనకు సందేహం. పోతే మిగతా మనబోటి వాళ్ళమంతా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టున్నాము. జ్ఞానమనే వాసన కూడా లేదు మనకు. మహా అయితే మనకు లోకజ్ఞానముంది. ఉచ్ఛావచమైన శాస్త్రజ్ఞానముంది. అంతేగాని మీరు చెప్పే బ్రహ్మజ్ఞానం కానరాదు. అదే ఉన్ననాడు మనకిక మరలా ఈ సంసారమనేది ఉండరాదు. అయినా మనలనిది నిత్యమూ వెంటాడుతున్నదంటే అప్పటికా జ్ఞానమింకా మన కంకురించలేదనే గదా అర్థం. మరి బ్రహ్మమనేది సర్వత్రా ఉండి - దాన్ని ఆకళించుకొనే మనస్సనే సాధనముండి - తర్జానాన్ని మనకందించే వాక్యప్రమాణం కూడా సిద్ధంగా ఉన్నప్పుడది మనకెలా అబ్బటం లేదని ఒక పెద్ద ఆక్షేపణ వస్తుంది.

   దీనికి పరిహారం మనమందరమూ చేసుకొన్న కర్మ తప్ప మరొకటేదీ గాదని చాటుతారు భగవత్పాదులు. ఎంచేతనంటే జ్ఞానోదయానికి కావలసిన సామగ్రి అంతా ఉండి కూడా జ్ఞానమనే ఫలితం కలగలేదంటున్నావు నీవు. అలా ఎప్పుడుగానీ జరగటానికి వీలులేదు. ఒకవేళ జరిగిందంటే ఆ సామగ్రిలోనైనా దోషముండాలి. లేదా అది పని చేయకుండా అడ్డు తగిలే బలమైన ప్రతిబంధకమయినా ఒకటుండాలి. సామాగ్రిలో లోపముందని చెప్పటానికి వీలులేదు. అది ఇంతకుముందే మనమెంత గానో ప్రతిపాదించి ఉన్నాము. పోతే ఇక పరిశేష న్యాయంగా దానికడ్డు తగిలే ప్రతిబంధకమే ఏదో ఒకటి ఉండాలి. ఏమిటది. ఏమిటని ప్రశ్నేముంది. మానవుడు చేసుకొన్న కర్మే మరేదీ కాదని ఘంటాపథంగా చెబుతారాయన.

Page 143