ఇంతవరకూ నిర్ద్వంద్వంగా సాగిన ఈ విచారణకంతటికీ నిర్గళితమైన Fil-tered అర్థమేమిటని అడగవచ్చు. జీవిత పరమార్థమయిన బ్రహ్మాత్మభావాన్ని మానవుడు సాధించాలంటే తన్నిబంధనమైన జ్ఞానమే దాని ఏకైక సాధనం. ఆ జ్ఞానం మనకు వాక్యప్రమాణం వల్లనే ఉదయిస్తుంది. వాక్యమంటే తత్త్వమస్యాదికమైన ఉపదేశం. అది మనకు అధ్యారోపాపవాద న్యాయాన్ని అనుసరించి తత్త్వాన్ని బోధిస్తుంది. అద్వితీయమయిన తత్త్వాన్ని ఒక్కసారిగా అందుకోలేము కాబట్టి అధ్యారోపం మొదట దానిలో భేదాన్ని ఆరోపిస్తుంది. తరువాత అపవాదమనేది హేతు దృష్టాంత బలంతో క్రమంగా ఆ భేదాన్ని నిరాకరిస్తుంది. తన్మూలంగా అఖండ బ్రహ్మతత్త్వానికి చెందిన ఒకానొక వృత్తి మనసులో ఆవిర్భవిస్తుంది. అఖండమైన ఈ వృత్తికి భిన్నంగా బ్రహ్మమనేది ఎక్కడా లేదు కాబట్టి ఈ జ్ఞానమే చివర కనుభవంగా మారుతుంది. అప్పుడు సాధకుడు నేనే ఆ బ్రహ్మమనే అనుభవాన్ని పొందుతాడు. కాబట్టి తత్త్వమసే చివరకు అహం బ్రహ్మాస్మి అవుతుంది. కాగా ఇలాంటి అనుభవం మానవుడికి కలిగే అంతిమమైన Final అనుభవం కాబట్టి అది సకల దుఃఖ సముచ్ఛేదకం కాబట్టి - దానికిక భ్రమ ప్రమాదానర్థకాది దోష స్పర్శకూడా లేదు. ఇది మనకు సాహజికమే గాని ఆగంతుకం కాదు మరలా. కనుక వాక్యోపదేశమీ విషయంలో మనకు జ్ఞాపకం Reminder మాత్రమేననే సూత్రం కూడా మనం మరవరాదు. ఇదీ దీని నిర్గళితార్థం.
Page 142