#


Back

   ఇదీ విషయం. నేతి నేతి అని అపోదితమైనతరువాత చిట్టచివరిగా ఉదయించే జ్ఞానమిది. చివరకు కలిగే జ్ఞానం గనుకనే దీనినిక కాదని త్రోసిపుచ్చే బాధక జ్ఞానం Contrary మరొకటి లేదు. బాధకం లేదంటే అది ఇక అబాధితంగా నిలిచిపోవలసిందే. అలాంటప్పుడు మానసికమైన భ్రమ ఎలా అవుతుందది. యధార్థజ్ఞానమే కావలసి వస్తుంది.

   యధార్థమైతే కావచ్చు. దానివలన మనకు కలిగే ప్రయోజనమేమిటని కొందరు వాదిస్తారు. అలాంటి వారిని కూడా నోరు మూయించారు భగవత్పాదులు. ప్రయోజనమే లేకుంటే ఇంత శాస్త్రమూ - ఉపదేశమూ ఈ కలాపమంతా దేనికని ప్రశ్నిస్తారాయన. అలాంటి ఉపదేశం చేయటంకన్నా ఊరుకోటం ఎంతో మేలు. "ప్రక్షాళనాద్ధి పంకస్య దూరా దస్పర్శనమ్ వర” మన్నారు పెద్దలు. అడుసు త్రొక్కటం దేనికి. కాలు కడగటం దేనికి. అలాగే నిరుపయోగమైన బోధ చేయటం దేనికి. “ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే” ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎంత మూఢుడు కూడా ఒక పని చేయబోడు. అలాంటిది ప్రమాణ భూతమైన శాస్త్రం చేస్తున్నదంటే అది ఏ మాత్రమూ శ్రద్దేయమైన మాట కాదు. కాబట్టి శాస్త్రమొక విషయం మనకు బోధించిందంటే దానికేదో ఒక విశిష్టమైన ప్రయోజనముండి తీరాలి. అదేమిటని అడుగుతారేమో. ఏమిటో గాదు. సకల దుఃఖ నివృత్తీ సర్వసుఖ ప్రాప్తి. ఇంతకన్నా కావలసిందేముంది జీవితానికి. అంతేకాదు. అది బ్రహ్మవేత్త లందరి దైనందిన జీవితంలోనే మనకు దాఖలా అవుతుందని అలాంటి వారీ రోజులలో కూడా జీవించి ఉన్నారని మనకెక్కడ లేని హామీ ఇస్తారాయన ఆస్తామేతత్.

   ఇంతకూ ఇంతటి మహోన్నతమైన ఫలం మనకు సిద్ధించాలంటే అదంతా ఈ అధ్యారోపాపవాద మార్గంలోనే తప్ప మరొక విధంగా సిద్ధించబోదు. అధ్యారోపాప వాదరూపంగా వాక్యం మనకు తత్త్వాన్ని బోధ చేస్తే దానివల్లఅఖండ బ్రహ్మాత్మజ్ఞానం మనకావిర్భవిస్తుంది. వాక్యజన్యమైన ఈ జ్ఞానమే చివర కనుభవంగా మారుతున్నది. అందులో “తత్త్వమసి" వాక్యం వల్ల జ్ఞానమైతే- "అహమ్ బ్రహ్మాస్మి” వాక్యంవల్ల దాని అనుభవం సిద్ధిస్తుంది. ఈ రెండింటి మూలంగా చివరకు మానవ జీవితానికి ప్రయోజనమేదో అది పరిసమాప్తమవుతున్నది. ఇదీ విషయం.

Page 141