దీనిని బట్టి అధ్యారోపమనేది ఎంత ఆవశ్యకమో తేట పడుతున్నది. అధ్యారోప
మధిష్ఠాన జ్ఞానమందిస్తే మనకాజ్ఞాన మప్రయత్నంగా అనాత్మ జగత్ప్రవిలాపనానికి
దారి తీస్తుంది. అంటే అప్పటికి తత్త్వమసి అనే ఉపదేశవాక్యం అహమ్ బ్రహ్మాస్మి
అనే అనుభవ వాక్యంగా మారుతుందని అర్ధం. నేనే బ్రహ్మమని ఈ జీవుడికి
దేహాత్మభావం పోయి సహజమైన బ్రహ్మాత్మభావం కలగటమే అహం బ్రహ్మాస్మి. ఇది
మన గొంతెమ్మ కోరికే గాని ఇంతటి మహాభాగ్యం మనబోటి జీవకోటి కబ్బుతుందా
అని సందేహించనక్కరలేదు. ఎందుకంటే మనస్సుకు కలిగే సుఖదుఃఖాదుల దగ్గరి
నుంచీ అన్ని భావాలూ మన చైతన్యానికి బాహ్యమే. చైతన్య క్షేత్రంలో అడుగుపెట్టే
అధికారం దేనికీ లేదు. పెడితే అది చైతన్యరూపమే అవుతుంది. ఇక దానికి
గోచరించటమేముంది. గోచరం కాకపోతే అది అనుభవమెలా అయింది. కాబట్టి
“సకల దుఃఖ వినిర్ముక్షైక చైతన్యాత్మ కోహ మిత్యేష ఆత్మానుభవః” అని తేల్చిపారేశారు
స్వామివారు. ఏ దుఃఖమూ ఏ సుఖమూ లేని కేవల చైతన్య రూపుడనే నేననే
అనుభవమే ఆత్మానుభవమట. ఏ భావమూ లేదంటే అనాత్మ అంతా అపోదిత
మయింది. ఏకమనటంలో జీవభావం తొలగిపోయింది. చైతన్యమనటంలో
స్వరూపాన్ని చెప్పినట్టయింది. అహమనటంలో అది ఎక్కడో నాకు పరోక్షంగా లేదు
నేనే అని అనుభవానికి తెచ్చినట్టయింది. ఇంతకన్నా వక్తవ్యమైన విషయమిక ఏముంది.
అయినా కడసారిగా కలిగే ఆశంక ఒకటుంది. ఎంత కాదన్నా ఈ శరీరాది సంఘాతమొకటి - దీనిచుట్టూ ఉన్న ఈ ప్రపంచమొకటీ - నోళ్ళు తెరచుకొని నిత్యమూ మన చైతన్యాన్ని కబళించినట్టు కనిపిస్తున్నాయి గదా. ఇవి ప్రవిలయం చేసుకొని మనం చైతన్య మాత్రశేషులమై ఉన్నామనుకోటం కేవలమూ మనఅపోహ Solipsism ఏమో. అది యధార్ధమని ఎందుకనుకోవాలని ప్రశ్న. ఇది కూడా అర్ధం లేని అపోహ అని మందలిస్తారు మనలను జగద్గురువులు. ఎందుకంటే మానసికమైన భ్రమ కావటానికిది సాపేక్షమైనది కాదు. నిరపేక్షమయిన జ్ఞానం.
Page 140