తొమ్మిదిమందే వస్తున్నారు లెక్కకు. అయ్యో ఇంకేముంది. పదోవాడుకాస్తా పరమపదించాడే అని ఏడవసాగారు. సమయానికెవడో పుణ్యాత్ముడటు వైపు వస్తూ ఏమయింది నాయనలారా! ఏడుస్తున్నారని అడిగాడు. అయ్యా ! పది మందిమి బయలుదేరాము గ్రామంతరానికి. దారిలో ఏరు దాటవలసి వచ్చింది. దాటేటప్పుడు మాలో ఒకడా ఏటిలో కొట్టుకుపోయాడని మొరపెట్టారు. వాడొక్కసారి అలా నిగా పెట్టి చూడగానే పదిమందీ ఉన్నట్టర్థమయింది. అయ్యో ! మీ పిచ్చి దొంగలు దోలా. ఎవరికి వారు మినహాయించుకొని లెక్కిస్తే ఎలా ఉంటారోయి పది మందీ. ఇదుగో నేను లెక్కిస్తాను చూడమని ఆ లెక్కించిన వాడితో సహా పదిమందినీ లెక్కపెట్టి చూపాడట. ఇప్పుడా పదవ వాడెక్కడ ఉన్నాడని. కొత్తగా ఎక్కడి నుంచీ రాలేదు వాడు. అంతకు ముందా తొమ్మిది మందిలో కలిసిపోయి వేరుగా కనపడలేదు. తొమ్మిది మందినీ లెక్కపెట్టి ప్రక్కకు నెట్టి ఇక మిగిలిన వాడెవడా అని చూస్తే అక్కడే ఉన్నాడు. కనిపించాడు.
అలాగే ఈ నామరూపాదులైన అనాత్మ భావాలలో పనగలిసి పోయినంత వరకూ అక్కడే ఉన్న ఆత్మతత్త్వం మనకు ఫలానా అని గ్రాహితాకు రాదు. గ్రాహితాకే రావాలంటే వీటిని ప్రక్కకు తోసి దానిని మాత్రమే మొదట పైకి తెచ్చుకొని చూడాలి. అందుకే అధ్యారోపం.అది అంతకుముందు లేని వస్తువును క్రొత్తగా సృష్టించదు. “జ్ఞాపకమి శాస్త్రమ్-నకారక”మని హెచ్చరిస్తారు భాష్యకారులు. శాస్త్రం మరచిపోయిన ఆత్మ స్వరూపాన్ని జ్ఞప్తికి తేవలసిందే గాని క్రొత్తగా ఒక ఆత్మను తయారుచేయబోదు. అలా జ్ఞప్తికి వచ్చిందంటే ఇక అనాత్మ ప్రపంచం దానిపాటికదే లయమవుతుంది. ఎందుకని. దీనికి వ్యతిరిక్తంగా అది లేదు కనుక. కనుకనే ఊరక లేదు లేదని అపవదిస్తే కాదు ఈ జ్ఞానంతో చేయాలని చెప్పటం. జ్ఞానంతో చేస్తేనే అది అపోదితమవుతుంది. ఎందుకంటే జ్ఞానంకంటే జ్ఞేయపదార్ధమెప్పుడూ భిన్నంగా ఉండలేదు అందుకే నేతి నేతి వాక్యం కూడా కేవల మపవాదం చేసి ఊరుకోలేదు. దానికి సబబు చూపుతూ చేస్తుంది అపవాదం. "నహ్యే తస్మా దితి నేతి" అని వాక్యశేషం. దానికి వేరుగా ఉండటానికి లేదు కాబట్టి ఇది లేదు అని దీని అర్థం. అంటే ఆత్మ చైతన్యముంటేనే అనాత్మ జగత్తు భాసిస్తుంటుంది. అది లేదో ఇది ఏ మాత్రమూ భాసించదు. అంచేత ఇది ఆచైతన్యమే కావాలి గాని తద్విలక్షణం కావటానికి లేదని తేలుతున్నది.
Page 139