అని అంతా చివర ఆ అద్వితీయ బ్రహ్మస్వరూపమే - అదే సత్యం - మిగతా ఈ సృష్టి కథ అంతా అసత్యమేనని తేల్చిపారేస్తుంది. ఇది ఉపనిషత్తు లొక్కటే గాదు. దానిమీద విచారణ సాగించిన బ్రహ్మసూత్రాలూ ఆ రెండింటి సారాంశమైన భగవద్గీతా అన్నీ కూడా ఇదే ధోరణి ననుసరిస్తూ వచ్చాయి. బ్రహ్మసూత్రాలలో రెండవ సూత్రమైన "జన్మాద్యస్య యతః" అనేది ఈ ప్రపంచ సృష్ట్యాదికమంతా శుద్ధమైన బ్రహ్మచైతన్యం మీద మొదట ఆరోపిస్తుంది. తరువాత "తద నన్యత్వ మారంభణ శబ్దాదిభ్యః” అనే సూత్రంతో ఆ వ్యవహారాన్నంతటినీ కొట్టివేసి తత్త్వాన్ని పరిశుద్ధంగా చూపుతుంది. అలాగే భగవద్గీత కూడా. “మతాని సర్వభూతాని - నచ మత్య్రాని భూతాని” సర్వేంద్రియ గుణాభాసమ్ - సర్వేంద్రియ వివర్జితమ్" ఇలాంటి ఘట్టాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మార్గమే అడుగడుగునా మనకు తార్కాణమవుతుంది. మొత్తానికి ఉపనిషత్తులేమిటి గీతలేమిటి - అధ్యాత్మ శాస్త్రమంతా మొదటి నుంచీ అనుసరిస్తూ వచ్చిన మార్గమిదే అసలు.
దీనిని బట్టి మనం గ్రహించవలసిన పరమరహస్యమేమంటే జీవ జగదభిన్నమైన చైతన్యమొక్కటే పరమార్ధం Supreme Reality. అది అభేద రూపమైనా దాన్ని మన అజ్ఞానవశాత్తూ అలాగే పట్టుకోలేక బాధపడుతున్నాము. అంచేత మన కాపట్టు చిక్కించటానికి శాస్త్రం మొదట భేదమనే పెద్ద నిచ్చెన వేసి దాని ఆధారంతో మన మా అభేదాన్ని అందుకొన్న తరువాత ఆ నిచ్చెన తీసివేస్తున్నది. దానితో అభేదమే మన మనసులో నిలిచిపోతుంది. ఇందులో భేదవర్ణన అధ్యారోపం ద్వారా ఆత్మవస్తువును గుర్తించటానికైతే అభేదంతో ముగించట మీ ఆరోపితాన్నంతటినీ క్రమంగా అపవదించి ఆత్మచైతన్యంలో లయం చేయటానికని సిద్ధాంతం. భేద ప్రస్తావన లేకుండా ఊరక అభేదాన్ని ప్రతిపాదిస్తే భేదవాసనా వాసితమైన మానవుడి బుద్ధికది పట్టటం అసాధ్యం.
ఇది మనకు బాగా బోధపడటానికి పరమానందయ్య శిష్యుల కథ చెబుతారు భగవత్పాదులు. శిష్యులంతా కలిసి గ్రామాంతరం బయలుదేరి వెళుతున్నారు. మార్గమధ్యంలో ఒక ఏరు అడ్డం వచ్చింది. నెమ్మదిగా అది దాటి అవలి ఒడ్డు చేరారు. పదిమందీ ఉన్నారో లేదో అని అనుమానం తగిలింది వారికి. ఎవడికివాడు తన్ను మాత్రం మానేసి మిగతా వాళ్ళనందరినీ లెక్కపెడుతూ వచ్చాడు.
Page 138