#


Back

   ఐతరేయ ఛాందోగ్యాలు ప్రపంచ సృష్టి స్థితి లయాల నారోపణ చేసి మరలా అవి ఏవీ లేవని అపవదిస్తాయి. ప్రశ్నోపనిషత్తు ప్రాణాదులైన పదహారు కళల ఆవిర్భావాన్ని వర్ణించి మరలా ఈ కళలన్నిటినీ నిష్కలమైన పురుష తత్త్వంలోకే ప్రవిలయం చేసి చూపుతుంది. మరి తైత్తిరీయమైతే అన్నమయాది పంచకోశాత్మకంగా చైతన్య పరిణామాన్ని పేర్కొని తరువాత ఈ కోశ పంచకాన్ని తదతీతమైన తత్త్వంగానే భావన చేయమని చెబుతూ వాటి అభావాన్నే నిరూపిస్తుంది. పోతే బృహదారణ్యకం విశేషాత్మకంగా ముందీ సృష్టినంతా ప్రస్తావించి మరలా దానినే సామాన్యాత్మకంగా దర్శించమని చెబుతు ప్రతి ఒక్కదాన్నీ ప్రవిలయం చేస్తుంది. ఇక కఠోపనిషత్తయితే దేహం మొదలుకొని ఈ ఉపాధి ప్రపంచాన్నంతటినీ స్థూల సూక్ష్మ క్రమంగా విభజించి స్థూలం నుంచి మన దృష్టినంతకంతకు సూక్ష్మంవైపు మళ్ళిస్తూ పోతుంది. తుదకు మాండూక్యమైతే అవస్థాత్రయ రూపంగా ఆరోపణ చేసి చివర దానినే అవస్థా రహితమైన తురీయ చైతన్యంలో పర్యవసానం చేసి ప్రదర్శిస్తుంది. మొత్తం మీద ఏ ఉపనిషత్తు చూచినా మొదట పారమార్ధికమైన అభేదాన్ని ప్రతిజ్ఞారూపంగా Propo-sition బోధిస్తుంది. అది ఎలా సంభవమని సాధకులడిగినట్టుగానే ఆశంక చేసుకొని దానికుపపాదకంగా మధ్యలో లేని భేదాన్ని తెచ్చి దానిమీద ఆరోపిస్తుంది. తరువాత చివరకాతెచ్చి పెట్టిన భేదాన్ని తానే అపవదించి ఆదిలో ఏది ప్రతిజ్ఞాతమైన సత్యముందో దానికే అంతంలో నిగమనం Conclude చేసి ప్రదర్శిస్తుంది.

   అంతెందుకు. ఒక ఛాందోగ్యాన్నే తీసుకొని చూతాము. “సదేవ సోమ్యేద మగ్ర-అసీత్-ఏకమే వాద్వితీయమ్” అని ఆరంభంలో అద్వితీయమైన బ్రహ్మతత్త్వాన్ని ప్రస్తావన చేసిందుపనిషత్తు. తరువాత "తదైక్షత బహుస్యామ్ ప్రజాయే యేతి-తత్తేజ అసృజత” - “అనేన జీవేనాత్మనా అనుప్రవిశ్య" అని ఈ విధంగా మధ్యలో జీవ జగత్సృష్టినంత ఏ కరువు పెట్టింది. ఇదంతా నిజమని మనం భ్రాంతి పడకుండా మరలా “అన్నేన సోమ్య శుంగేన ఆపో మూల మన్విచ్ఛ - అద్భిస్సోమ్య శుంగేన తేజో మూల మన్విఛ్ఛ - తేజసా సోమ్య శుంగేన సన్మూల మన్విచ్ఛ- న స్మూలాః ఇమాః ప్రజాస్పదా యతనా సత్ప్ర తిష్ఠాః స య ఏషోణిమా - ఐతదాత్మ్య మిదమ్ సర్వమ్-తత్సత్యమ్"

Page 137