అని భగవత్పాదుల పరమగురువైన గౌడపాదులెప్పుడో చాటి చెప్పారీ రహస్యం. దానినే వారి ప్రశిష్యులైన ఆచార్య సార్వభౌములుకూడా ఇలా వర్ణించారు. అక్షరాలూ అంకెలూ-వీటి స్వరూపం మనకు బోధపడాలంటే- ఒక కాగితమనీ-కలమనీ సిరా అనీ-ఇలాంటి పరికరాలన్నీ పోగుచేసుకొంటాము. ఈ పరికరాలే ఆ అక్షరాలా. కాదు. ఇవి అక్షరాలంటే ఏమిటో వాటి తత్త్వం Nature మనకు బోధచేసే సాధనాలు Aids మాత్రమే. ఆ జ్ఞానం మన కేర్పడిందంటే ఇక ఆ సామగ్రితో పని లేదు మనకు.
అలాగే ఆ ఏకైకమైన తత్త్వాన్ని గ్రహించేటందుకొక అలంబనమే ఈ సృష్టి ప్రవేశాది వర్ణనమంతా. అంతేగాని ఇది- ఏదో జరిగింది చేసిందని గాదు. దీని ద్వారా ఆ తత్త్వాన్ని అందుకొన్న తరువాత ఇది కూడా మనకిక అక్కరలేదు. నిరాకరించవచ్చు. నిరాకరిస్తే కాగతం కలంలాగా ఎక్కడో ఉండేది కూడా కాదిది. అంతా అవిద్యా కల్పితమే కాబట్టి విద్యలోనే ఈ సమస్తమూ ప్రవిలయమవుతుంది. అప్పుడేకైకమైన బ్రహ్మతత్త్వమే సాధకుడి స్వరూపంగా Subjective సాక్షాత్కరిస్తుంది.
అంచేత శాస్త్రంలో భేదరూపంగా వర్ణించిన అవాంతర వాక్యాలన్నీ అసత్యాలే. స్వతహాగా అసత్యాలైనా అవి సద్రూపమైన మహావాక్యార్థాన్ని చేరేందుకొక ఆలంబనంగా మాత్రమే పనిచేస్తాయి. అయితే వాటినలాగే భావించాలి మనం. సంకేతాన్నే సత్యమని భ్రాంతిపడరాదు. కాకపోయినా భేదం సత్యమెలా అవుతుంది. అభేదమే గదా భేదమయిందని నిరూపించాము. మరలా అది చివరకు అభేదమే కావలసి ఉంది. మొదటా చివరా అభేదమయి మధ్యలో మాత్రమే అది భేదమెలా కాగలదు. “ఆదావంతే చ యన్నాస్తివర్త మానేపి తత్తథా” అని గదా అభియుక్తోక్తి. కాబట్టి మధ్యలో భేదాన్ని శాస్త్రం వర్ణించిందంటే ఎప్పుడూ ఉన్న అభేద తత్త్వాన్ని మనం మరలా జ్ఞప్తికి తెచ్చుకొనేందుకే. అదే మరొక భాషలో చెబితే అధ్యారోపమనేది అపవాదానికే. ఇదుగో ఈ ప్రక్రియనే ఉపనిషత్తులన్నీ తూచా తప్పకుండా అనుసరిస్తూ వచ్చాయి. అధ్యారోపం చేసి అపవాదం చేయటమే ఏ ఉపనిషత్తెనా చేస్తూ వచ్చిన పని. అద్వితీయ బ్రహ్మానుభవాన్ని జీవులకందజేయటానికి ఉపనిషత్తులన్నీ అవలంబించిన ఏకైక మార్గ The only method మిదే సుమా అని మాటి మాటికీ హెచ్చరిస్తారు శంకర భగవత్పాదులు. అయితే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క భంగిమలో దాన్ని బయట పెడుతూ వచ్చింది. అంత మాత్రమే. అది ఎలాగో చూతాము.
Page 136