#


Back

   అభేద రూపమైన తత్త్వాన్ని భేద రూపంగా వర్ణిస్తే అది కాల్పనికం కాక వాస్తవమెలా అవుతుంది. అయితే మరెందుకు వర్ణించినట్టు అని అడుగుతావేమో దాన్ని అందుకోటానికొక ఉపాయం మాత్రమేనని గ్రహించాలి సాధకుడు.

   దీనికి తార్కాణంగా సంప్రదాయజ్ఞులు చెప్పే ఒక చక్కని ఆఖ్యాయిక మనకందించారు భగవత్పాదులు. యుద్ధంలో ఒక వృద్ధరాజు మరణిస్తే రాజకుమారుడు శత్రువులబారిని బడట మిష్టంలేక అమాత్యు లాబాలుణ్ణి రహస్యంగా కొనిపోయి ఒక బోయపల్లె చేరుస్తారు. అతడా పల్లెలో పెరిగి పద్దవాడయి కూడా తానొక రాజపుత్రుడనే కథే మరచి కాలం గడుపుతుండేవాడు. ఇలా ఉండగా కొంత కాలానికాబోయ వృద్దు కాలం దీరి మరణిస్తూ ఆ కుఱ్ఱవాణ్ణి దగ్గరికి పిలిచి నాయనా నీవు మా బోయ కులంలో పుట్టినవాడవు కావు. ఇంతకు పూర్వమీదేశ మేలిన రాజుగారి కుమారుడవు. మంత్రులు నిన్ను చిన్నవయసులోనే రాజకులం నుంచి తెచ్చి నా కొప్పగించారు. ఇప్పటికైనా నీవు తగిన బలగంతో పోయి నీ శత్రువులను జయించి నీ రాజ్యం నీవు మరలా దక్కించుకోమని బోధించి ప్రాణాలు విడిచాడట. ఆ మాట వినగానే అతడు శబర కులాభిమానాన్ని విడిచిపెట్టి వెనుకటి తన రాజకులాభిమానాన్ని మరలా మనసుకు తెచ్చుకొన్నాడట.

   ఇప్పుడా రాజు పుత్రుడిలాంటివాడే ఈ జీవుడు. వాడు కర్మం చాలక ఆ శబర కులంలో పోయి పడ్డట్టు వీడూ వచ్చి పడ్డాడీ శరీరాది సంఘాతంలో. మంత్రులలాగానే ఒప్పజెప్పాయి వీణ్ణి ధర్మాధర్మాదులైన ద్వంద్వాలు. వాడికి చివర ఆ శబర వృద్ధుడుపదేశించినట్టే వీడికీ ఏ ఆచార్య పురుషుడో ఉపదేశిస్తాడు బ్రహ్మాత్వభావాన్ని, ఆ రాజపుత్రుడి కెలాగైతే నీవా రాజకులం నుంచి వచ్చావనే వాక్యం నేను కిరాతుణ్ణి కాను రాజు వంశ్యుడనే అనే అభేద భావనకు దారి తీసిందో అలాగే ఈ జీవ జగత్తులు రెండూ ఆ బ్రహ్మం నుంచే సృష్టి అయినాయని చెప్పే శాస్త్రవాక్యం కూడా ఇవి ఆ బ్రహ్మమేననే ఏకత్వానుసంధానానికే దోహదం చేస్తుంది. ఈ నిప్పురవ్వ ఎక్కడిదో గాదు ఆ గాడిపాయిలోదే అని ఎవడైనా అన్నాడంటే ఆ మాటకేమని అర్ధం. ఇది వేరు అది వేరూననా కాదు. రెండూ ఒకటేనని తాత్పర్యం. కాబట్టి ఇంతకూ శాస్త్రం ప్రపంచ సృష్టిస్థితిలయాలూ జీవుడి ప్రవేశాదులూ ఇలాంటి భేద రూపమైన వర్ణన అంతా తద్ద్వారా అభేద దృష్టిని మన మలవరుచుకోటానికి అవలంబించిన ఒక ఉపాయమే. “ఉపాయ స్సోవ తారాయ- నాస్తిభేదః కథంచన”

Page 135