#


Back

   ఇదుగో ఇలాంటి ఆత్మైకత్వ ఫలసిద్ధి కోసమే ఈ అధ్యారోపాప వాదరూపమైన సాధన ప్రక్రియ. మొదట నుంచీ సాంప్రదాయికంగా Traditional గురుశిష్య పరంపరలో వస్తూ ఉన్న ప్రక్రియ ఇదే ఆసలు. “అధ్యారోపా పవాదా భ్యామ్ నిష్ప్రపంచమ్ ప్రపంచ్యతే” అని భగవత్పాదులు కూడా దానినే ప్రమాణంగా తీసుకొని ఉదాహరిస్తారు. వేదాంత జ్ఞాన ప్రచారానికంతటికీ ప్రణాళిక Medium ఇది తప్ప మరొకటి ఏదీ లేదని చాటుతూ వచ్చారాయన. దీని ననుసరించే ఆయన తన ప్రస్థానత్రయ భాష్య మహాసౌధాన్నంతటినీ నిర్మించారు. ఇందులో అధ్యారోపమనేది అవాంతర వాక్యమైతే అపవాదాన్ని మహా వాక్యమని వ్యవహరించారు శాస్త్రజ్ఞులు. జగత్ప్రవిలయం ద్వారా జీవ బ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించేది మహావాక్యం. తత్త్వమసి ఇత్యాదులిలాంటి మహావాక్యాలే. పోతే ఈ బ్రహ్మాత్మావగతికి దోహదం చేసే ప్రపంచ సృష్ట్యాది వర్ణనలన్నీ అవాంతర వాక్యాలు.

   అవాంతర వాక్యం మనకు పదార్థ జ్ఞానమిస్తుంది. అంటే బ్రహ్మమనే పదార్ధమిప్పుడు నామరూపాదికమైన అనాత్మ జగత్తుతో పనగలిసి ఉంటే అన్వయ వ్యతిరేకాలతో Permutation and combination వివేచన Differentiate చేసి చూపుతుంది. దానితో బ్రహ్మమంటే ఫలానా గదా అనే జ్ఞానమేర్పడుతుంది మనకు. పోతే ఈ పదార్ధ జ్ఞానం వెంటనే వాక్యార్థ జ్ఞానానికి దారి తీస్తుంది. వాక్యార్దమంటే ఆ బ్రహ్మతత్త్వాన్ని దేని నుంచి వివేచన చేశామో అది కూడా దానికంటే వేరుగా లేదని అభేద భావం. అంటే జీవజగదభిన్నమైన బ్రహ్మమొకటి ఉందని గ్రహించటం. ఇలాంటి జ్ఞానాన్ని మనకు మహావాక్యమందిస్తుంది. "పదార్ధ జ్ఞానపూర్వకత్వా ద్వాక్యార్ధ జ్ఞానస్య" అంటారు స్వామివారు. వాక్యార్థ జ్ఞానానికి Synthetic knowledge పదార్ధ జ్ఞాన Analytic knowledge Prerequisite. ప్రధాన విషయం వాక్యార్థజ్ఞానమే అయినాదానికోసం కల్పించుకొన్న ఒక సాధన మీ పదార్ధ జ్ఞానం. దానినందిస్తుంది అవాంతర వాక్యం. అవాంతరమంతా అప్పటికి కాల్పనికమే.

Page 134