#


Back

   వీటిని కాదని వీటన్నిటికీ విలక్షణంగా దాన్ని మనసుకు తెచ్చుకోవాలి మొదట. అది ఎలాగా. ఈ చూచే ప్రపంచం దానివల్ల సృష్టి అయిందని చెబుతుంది శాస్త్రం. తన్మూలంగా ఈ సృష్టి అయిన ప్రపంచ లక్షణాలకంటే విలక్షణంగా భావించగలం దాన్ని ప్రపంచం నామరూపాత్మకమైతే అది నామ రూప రహితం. ఇది పరిచ్ఛిన్నమైతే అది పరిపూర్ణం. ఇలా ప్రపంచ సృష్టిని దానిమీద ఆరోపించటంవల్ల ప్రపంచ లక్షణాలకు భిన్నంగా దాని లక్షణాలు భావించటాని కవకాశందొరికింది. ఏమిటా లక్షణాలు. ఒక్క మాటలో చెబితే నామరూపాదులేవీ లేని అఖండంగా వ్యాపించిన జ్ఞేయం కాని కేవల జ్ఞానస్వరూపం. ఇదే దాని లక్షణం.

   ఇది మన స్వరూపమే కాబట్టి వెంటనే ఆకాశంలాంటి ఒక అఖండ భావన మనలోపలా వెలపలా నిండి ఉన్నట్టు అనుభవానికి వస్తుంది. దీనికే బ్రహ్మాకారవృత్తి అని ఇంతకు ముందు వర్ణించే ఉన్నాము. ఈ వృత్తికే అధిష్ఠాన జ్ఞానమని పేరు. అది అధ్యారోపంవల్లనే కలుగుతుంది. ఇప్పుడీ జ్ఞానంతో మన మా బ్రహ్మంమీద ఆరోపితమయిన ప్రపంచాన్ని మరలా చూస్తాము. చూస్తే ప్రపంచమిక ప్రపంచంగా కనిపించదు. వననదీ పర్వతాదికమయిన ప్రతి ఒక్క పదార్ధమూ తదాకారంగానే మరలా మనకు సాక్షాత్కరిస్తుంది. అంటే సదాకారంగా చిదాకారంగా భాసిస్తుంది. ప్రపంచమనేది అప్పుడిక చెప్పకుండానే అపవాదమై పోతుంది.

   కనుకనే అపవాదానికెప్పుడూ అధ్యారోపమనేది పూర్వరంగం. అది ఉత్తరార్ధమైతే ఇది పూర్వార్ధం. ఇది లేకుండా అది ఫలించదు. అధ్యారోపం బ్రహ్మజ్ఞానమైతే అపవాదం ఆ జ్ఞానంతో బ్రహ్మేతరమైన జగత్తునంతా ప్రవిలయం చేయటం. దీనితో సాధన పూర్తి అయి సిద్ధినందుకొంటాడు మానవుడు. కనుక అపవాదమే చివరకు ముఖ్యమైనా అధ్యారోపమనేది దాని కంగభూతం. అయితే బ్రహ్మతత్త్వాన్ని సాక్షాత్తుగా భావించటం పనికిరాదని గదా చెప్పారు. మరి బ్రహ్మాకారవృత్తి మాత్రమెలా ఏర్పడుతుందని ఒక చిన్న ఆశంక రావచ్చు. అది వాస్తవమే. కాని ఈ వృత్తిని కూడా మనమెంతో కాలం నిలుపుకోవటం లేదు. అది తాత్కాలికమే. అపవాదం చేయటం కోసమే ఆ వృత్తి. ప్రపంచ మపోదిత మయిందంటే దానితోపాటు ఈ వృత్తికూడా ప్రవిలయమై పోతుంది. ఒక ముల్లు తీయటానికింకొక ముల్లు నుపయోగించి తరువాత ఆ రెండు ముళ్ళూ ఎలా పారవేస్తామో అలాగే వృత్తిజ్ఞానమెంత కాల్పనికమైనా అది ప్రపంచ ప్రవిలయాని కుపయోగపడుతుంది. ఆ తరువాత రెండూ ప్రవిలయమై అవి మన ఆత్మ స్వరూపంగానే పరిణమిస్తాయి. అప్పటి నుంచి ఆత్మైవాత్మా.

Page 133