అయితే ఒక మాట. అలా అపోదితమవుతున్నా చరాచర పదార్థాలు మనచుట్టూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక మోతాదులో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి గాని సర్వాత్మనా నశించి అంతా శూన్యం మాత్రమయి పోదు. ఆయా విశేషాలు పోయినా సామాన్య రూపంగా ప్రపంచముండనే ఉంటుంది. దీనికి నియామకమైన దేశకాలాలూ అలాగే భాసిస్తుంటాయి. దేశకాల వస్తువులనే ఈ మూడు పరిచ్ఛేదాలూ Three dimensions చిత్ర విచిత్రంగా ఎప్పటికప్పుడు గోచరిస్తూనే ఉన్నప్పుడిక వీటినెలా ప్రవిలాపనం చేయగలం. చేసినా అవి ప్రవిలయమయ్యే మార్గం కనపడటం లేదే అని ఒక పెద్ద భీతాహముంటుంది సాధకులకు.
వాస్తవమే. ఇలాటి భీతాహ మేర్పడటంలో ఆశ్చర్యం లేదు. దీనికి కారణం అపవాదమనేది అలాగే చేయాలని ప్రయత్నించటం. అధిష్ఠాన దృష్టితో అపవాదం చేయాలిగాని దానినలాగే చేయరాదు. చేసినా ప్రయోజనం లేదు. వట్టి ప్రయాసే గాని అది ఎక్కడికి పోదు. రజ్జు దృష్టితో చూస్తే సర్పం తొలగిపోతుంది గాని ఊరక సర్పమా తొలగి పొమ్మంటే పోతుందా. అలాగే బ్రహ్మదృష్టి పెట్టుకొని ఆ దృష్టితో ఈ నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూడాలి. “దృష్టిమ్ జ్ఞానమయీమ్ కృత్వా పశ్యే దహ్మమయమ్ జగత్తని” అభియుక్తుల మాట. కనుక అపవాదం చేయాలంటే ముందుగా అధిష్ఠాన జ్ఞానముండి తీరాలి. మరి అధిష్ఠానం ఫలానా అని గుర్తించాలంటే దాని నధ్యారోపణ మూలంగానే గుర్తించాలి తప్ప మరొక మార్గం లేదు.
దీనిలో మర్మమేమంటే అధిష్ఠానమైన బ్రహ్మచైతన్యం సువర్ణ మాభరణాలలో మాదిరి నామరూపాత్మకమైన సకల పదార్ధాలలోనూ ఓతప్రోతంగా కలిసిపోయి మనకిప్పుడు దాని స్వరూపం విడిగా గ్రహితాకు రావటంలేదు. దాన్ని పట్టుకొందామని చూడబోతే కమ్మలూ కాసుల దండలలాగా వన నదీ సర్వతాదులే కంటికి సోకుతుంటాయి గాని అది మనకు పట్టుచిక్కదు. మీదు మిక్కిలి అది కూడా వీటి రూపంలోనే మనకు దర్శనమిస్తుంటుంది. అలాంటప్పుడేమి చేయాలి మనం.
Page 132