అందులో ఎన్నో పట్టణాలూ, పర్వతాలూ, మేడలూ, మిద్దెలూ, మనుషులూ, మృగాలూ, ఒకటేమిటి. చిత్ర విచిత్రమైన దృశ్యాలెన్నో చూస్తుంటాము. చూచినంతసేపూ అవి కంటికి కనిపిస్తూ ఒంటికి సోకుతూ ఎంతో గట్టిగానే తోస్తుంటాయి. కాని ఉన్నట్టుండి మెళకువ రాగానే అందులో ఏ ఒక్కటీ ఇక ఆచూకీ ఉండదు. అంతగట్టిగా చూచిందీ - హఠాత్తుగా కరిగిపోయి మనకు మనమే మిగులుతాము. ఏమి కారణం. అదంతా మన అజ్ఞానంవల్ల భాసించిందే. కనుకనే మరలా జ్ఞానోదయమయ్యేసరికి సురిగిపోతుంది.
అలాగే ఇక్కడా మన అజ్ఞానంవల్లనే ఈ జాగ్రత్ప్రపంచం కూడా ఇలా నిత్యమూ భాసిస్తున్నది. ఎంత భాసించినా ఇది మనమిలా చూస్తూ చేస్తున్నంతవరకే. ఎప్పుడు మనకు బ్రహ్మజ్ఞానముదయిస్తుందో అప్పుడిది కూడా ఒక స్వప్న జగత్తు మాదిరే మటుమాయమై పోతుంది. అయితే అది తాత్కాలికమైతే ఇది దీర్ఘకాలికం. దానికెప్పటి కప్పుడు ప్రబోధమనేది ఏర్పడుతుంటుంది. కనుకనే ఇది కేవలం స్వప్నమేగాని యధార్థం కాదని భావించగలుగుతున్నాము మనం. అలాంటి వ్యవహారం కాదిక్కడ. ఇది యావజ్జీవమూ ఉండేది కాబట్టి ఇంకా స్వప్న జగత్తులోనే ఉన్నాము మనమంతా స్వప్నం నుంచి తేరుకొన్న అనుభవమెలాంటిదో ఇంకా తెలియదు మనకు. కనుకనే అలాంటి దొకటుందా - అది కలిగితే ఇది పోతుందా అని నమ్మలేకపోతున్నాము.
ఆ మాటకు వస్తే జాగ్రత్తులో మనం చూచేది కూడా ఒక స్వప్నమే వాస్తవానికి. పది పదిహేనేండ్ల క్రితం మనం చూచిన పదార్ధాలు గానీ మనషులు గానీ పరిస్ధితులు గానీ ఇప్పుడు లేవు. బాల్యంలో చూచినవెన్నో ఇప్పుడు కానరావు. అవన్నీ మనస్మృతి పథంలో మాత్రమే నిలిచిపోయాయి. పోతే ఇప్పుడెంతో యధార్థంగా అనుభవానికి వచ్చే సన్నివేశాలు కూడా ఇరవై ముప్పై ఏండ్లు గడిచేసరికి వెనకకు తిరిగి చూస్తే ఎక్కడా కనపడవు. కాల ప్రవాహంలో కలిసిపోయి అంతా ఒక కలలాగా కరిగిపోతుంది. అందుకే ఉపనిషత్తు మన జాగ్రత్స్వప్న సుషుప్తులను మూడింటినీ స్వప్నమనే వర్ణించింది. "త్రయః స్వప్నాస్త్రయ ఆవసథాః” అని ఉపనిషత్తు చాటిన సత్యం. కాబట్టి కాలమే అపవదిస్తున్న దసలీ ప్రపంచాన్ని. మనవరకూ కూడా అక్కరలేదు.
Page 131