కనుక ఈ మన అజ్ఞాన దృష్టికారంభమే లేదు వాస్తవంలో. ఇది బాగా వేళ్ళు పాతుకొని పోవటంవల్ల మనమిలా చూచి చూచి ఈ ప్రపంచ దృశ్యం మనకు బాగా గట్టిపడిపోయింది. అయితే ఎంత గట్టిపడినా ఇది మన అజ్ఞానంవల్ల పడిన గట్టితనమే కాబట్టి జ్ఞానోదయమైతే చాలు. సూర్యోదయమయితే చీకటి పొరలలాగా ఎక్కడదక్కడ విరిసిపోగలదు. కాబట్టి జ్ఞానం చేతనే ఈ ప్రపంచం ప్రవిలయమయి పోవాలి గాని భౌతికంగా పోయేది కాదు.
అయితే జ్ఞానం మాత్రం దీన్ని ఎలా కరగదీస్తుందని ప్రశ్న రావచ్చు. ఎందుకంటే జ్ఞానమనేది మానసికంగా కలిగే ఒకానొక వృత్తి Mental process ప్రపంచమనేది బాహ్యంగా మన చుట్టూ పరచుకొని ఉన్న ఒక భౌతికమైన పదార్థం. Physical object మన మనసులో లేదని భావించినంత మాత్రాన ఇది భౌతికంగా మాయమైపోతుందా అని సందేహం. తప్పకుండా పోతుందనే హామీ ఇస్తారు భగవత్పాదులు. కారణమేమంటే మనం ముందు నుంచీ ఏకరువు పెడుతూనే ఉన్నాము. ప్రపంచమనేది నీకెంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నా ఇది దానిపాటికది స్వతస్సిద్ధంగా ఉన్న పదార్థం కాదు. కేవలమొక ఆభాస. ఆభాస అనేది వస్తువు కాదు. వస్తువు తాలూకు నీడ. వస్తువే ఆ రూపంలో మనకు భాసిస్తున్నది. అంతమాత్రమే. రజ్జువు సర్పంలాగా భాసించటం లేదా. అలాగే ప్రస్తుతం బ్రహ్మమే మనకు ప్రపంచంగా భాసిస్తున్నది.
అలా భాసిస్తున్నదంటే ఆ బ్రహ్మం తనపాటికి తాను కావాలని భాసించటంకూడా కాదు ఒక నిమిత్తంవల్ల ఏర్పడిందే ఆభాస. కనుక నిమిత్తమున్నంత వరకే దానికి స్ధితి. నిమిత్తం పోయిందంటే ఇక అది ఉండటానికి వీలు లేదు. దానితో పాటు ఇదీ పోవలసిందే ఆ నిమిత్తమేమిటిక్కడ. అనాది సిద్ధమైన మానవుడి అజ్ఞానమేనని చెప్పాము. అది జ్ఞానంతో ఎప్పుడు రూపుమాసిందో అప్పుడీ అజ్ఞాన జన్యమైన ప్రపంచం కూడా మాసిపోక తప్పదు. ఇంత గట్టిగా కనబడుతున్న పదార్ధం కదా. ఎలా మాసిపోతుందని సందేహించనక్కరలేదు. అలాంటి సందేహమెప్పుడు కలిగినా మన స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు స్వామివారు. ప్రతిరోజూ నిద్రలో మనకేదో ఒక స్వప్నం వస్తుంటుంది.
Page 130