ఇక్కడ అపవాదమనే మాటను బాగా అర్థం చేసుకోవాలి మనం. అద్వైతంలో అపవాదమనే మాట పారిభాషికం. అంటే మిగతా దర్శనాలలోనూ మనదైనిక జీవితంలోనూ అనూచానంగా చెప్పుకొనే అర్థమిక్కడ పనికిరాదు. మిగతా చోట్ల అపవాదమంటే ఒక వస్తువును దూరంగా త్రోసివేయటం. అలా త్రోసివేస్తే అది మనదగ్గర లేదనే గాని మరెక్కడైనా ఉండవచ్చు. ఎక్కడా లేకుండా మాయమైపోదది. ప్రస్తుత మీ అద్వైతులు చెప్పే అపవాదమలాంటిది కాదు. ఇక్కడ ప్రపంచాన్ని మన మపవాదం చేశామంటే అది ఇక ఎక్కడా లేకుండా పోతుంది. దానికిక అస్తిత్వమే ఉండబోదు. దీనికే భగవత్పాదులు ప్రవిలాపన Total Dissolution మని పేరు పెట్టారు. ప్రవిలాపనమంటే బాగా కరగదీయటమని అర్థం. బ్రహ్మమనేది శుద్ధ చైతన్యాత్మకం. అది నామరూపాత్మకమైన ప్రపంచంగా పేరుకొని పోయింది. ఈ పేరుకొన్న ఘనపదార్ధాన్ని మరలా మనం కరగదీసుకొంటూ పోవాలి. కరగిస్తే అది మరలా మన దృష్టికి శుద్ధచైతన్య రూపంగానే భాసిస్తుంది.
అయితే కరగించటమనే సరికి కేవలమొక ఘనాన్ని ద్రవంగా మార్చుకోవటమని మరలా అపోహపడరాదు. ఊరక దృష్టాంతం కోసం చెప్పిందే గాని ఈ మాట నిజంగానే ఈ ప్రపంచమొక పేరుకు పోయిన పదార్ధమనీ దానిని మనం నిజంగానే కరగదీయాలేమోనని భ్రాంతి పడరాదు. కరగదీయటమనేది ఇక్కడ ఒక పేరిన నేతిని కరగదీసినట్టు ఒక మంచు గడ్డను కరగదీసినట్టు కాదు. అవి భౌతికంగానే పేరుకుపోయిన పదార్ధాలు కాబట్టి వాటిని భౌతికంగానే కరగించవచ్చు మనం. పోతే ఇది వాటిమాదిరి భౌతికం కాదు. భౌతికమే అయితే మొట్టమొదటి సారిగా ముక్తి బొందిన ఏ వ్యాస వసిష్ఠాదులో దీని నెప్పుడో కరిగించి ఉండేవారు. వారే కరగిస్తే మనకిప్పుడు మరలా దాన్ని ప్రవిలాపనం చేయవలసిన అవసరం లేకపోయేది. అయినా ఇప్పుడు మనకీ ప్రపంచమిలా భాసిస్తున్నదంటే ఏమని అర్థం. అప్పటికి భౌతికంగా కాదన్నమాట దీని ప్రవిలాపనం. భౌతికం కాకపోతే మరేమిటి. జ్ఞానంతో మాత్రమే కరగదీయాలి దీన్ని ఎందుకంటే మనకిది బ్రహ్మమనే జ్ఞానం లేకపోవటం వల్లనే దీన్ని నామరూపాత్మకమైన జగత్తుగా చూస్తున్నాము. ఈ చూడట మీ జన్మతో ఆరంభమైనది కాదు. ఇది ప్రారంభమయి ఎన్నో లక్షల కోట్ల జన్మలు గడచిపోయాయి. అలా చెప్పటం కూడా సబబు కాదట. అనాది అని గదా చెప్పాము మన అజ్ఞానం.
Page 129