అన్వేషణ పూర్తిగా తొలగాలంటే అప్పటికి పరిగణితమయిన Enumerated ప్రతిషేధం చేయగూడదు. వీస్సారూపమయిన Exhaustive ప్రతిషేధమే చేయాలి. దీనిలో విశేషమేమంటే ఏదేది మనసుకు వస్తుందో రావటానికి వీలుందో అదీ ఇదీ అనే ప్రశ్నేలేదు. ప్రతి ఒక్కటీ సృష్టిలో ఎక్కడ ఎప్పుడు తారసిల్లినా అదంతాలేదు లేదని త్రోసిరాజంటూ పోవటమే. మనసుకు వచ్చినదంతా త్రోసి రాజంటే ఇక ఏదీ లేదు సృష్టిలో నాకు నేనే ఉన్నానని ఆత్మలోనే మనసు విశ్రాంతమయి అన్య జిజ్ఞాస తొలగిపోతుంది. అప్పుడిక తప్పనిసరిగా మనస్వరూపం మన కనుభవానికి రావలసిందే.
అసలాత్మ అనేది మన స్వరూపమైనా మనకు దాని సంవేదన Experience కలగటం లేదంటే ఏమి కారణం. దానికీ నామరూపాలనే తిరస్కరిణులడ్డు తగలటం తప్ప మరేదీ గాదు. కనుక ఈ అంతర్థిని తొలగించటానికే మనం చేయవలసిన కృషి అంతా. అంటే ఏమన్నమాట. అనాత్మ భావాన్ని పోగొట్టుకోటానికే గాని ఆత్మను రాబట్టుకోటానికి గాదు. ఆత్మ అనేది మనకెక్కడో దూరంగా లేదు. ఆత్మ అంటే స్వరూపం ఆకాశంలాగా అది మనలోపలా వెలపలా నిండి నిబిడీకృతమయి ఉంది. అది మనకు హేయమూ గాదు. ఉపాదేయమూ గాదు. హేయమంటే త్రోసివేయటం. మనస్వరూపమే అయిన దాన్ని మనమెలా త్రోసివేయగలం. పోతే ఇక ఉపాదేయమంటే దగ్గరగా తీసుకోవటం. అంతటా అదే పరచుకొని ఉన్నప్పుడు దాన్ని మనం దగ్గరగా తీసుకోవటమేమిటి. తీసుకోకముందే ఉందది మన దగ్గర. కాబట్టి ఆత్మవిషయంలో లేదెలాటి ప్రయత్నమూ, అనాత్మ నపవదించటంలోనే చేయాలి ప్రయత్నమంతా.
అయితే అపవదించటమన్నారు బాగానే ఉంది. అపవదించటమంటే త్రోసి పుచ్చటమని గదా అర్థం. త్రోసిపుచ్చవలసింది దేనిని మనం. అనాత్మ భూతమైన ఈ ప్రపంచాన్నే గదా ఈ ప్రపంచాన్ని ఎలా త్రోసి పుచ్చాలి మనం. త్రోసి పుచ్చితే మాత్రమెక్కడికి పోతుందది. ఎక్కడో ఒకచోట ఉండవలసిందే గదా. అలా ఉంటే మన బ్రహ్మం సద్వితీయమే కావాలిగాని అద్వితీయమెలా అవుతుందని ఒక పెద్ద ఆశంక వస్తుంది.
Page 128