#


Back

   అనాత్మ పదార్ధాల మాదిరి దానికొక నామమూ, రూపము, క్రియా అనే లక్షణాలేవీ లేవు. ఏది ఉన్నా అది బ్రహ్మమే గాదు. అలాంటప్పుడు సత్తన్నా - చిత్తన్నా - ఆకాశమన్నా మనస్సన్నా ఏమన్నా దాని స్వభావానికి ప్రతికూలమయిన మాటే. కాబట్టి తద్ద్వారా దాన్ని యధాతథంగా ఎప్పుడూ పట్టుకోలేము. యథారూపంగానే పట్టుకోవాలంటే దాన్ని విధి ముఖంగా భావించనే కూడదు. అలా భావించే కొద్దీ ఏదో ఒక రూపంలోనే దాన్ని భావించవలసి వస్తుంది. ఎంత సూక్ష్మమైన రూపమైనా అది రూపమే. ఆ మేర కావస్తువు పరిచ్ఛిన్నం కాక తప్పదు. శాస్త్రమొకవేళ ఆకాశాది రూపంగా భావించమని చెప్పినా అది ఆలంబనంగా Aid చెప్పిన మాటే. ఆలంబనమనేది అసలు తత్త్వాన్ని పట్టుకొనేందుకుపాయమే గాని ఉపేయమైన ఆ తత్త్వాన్ని దీనిమేరకే దించి చూచేందుకు గాదు. అలాదించి చూడటానికే ప్రయత్నిస్తారు మంద మధ్యములంతా. ఉపేయాన్ని End విడిచిపెట్టివారు ఉపాయాన్నే Means పట్టుకొని కూచుంటారు. అలా కూచోటంవల్ల బ్రహ్మతత్త్వాన్ని అంతకంతకు నిరాకారంగా భావించే బదులు మరలా సాకారంగా దర్శించే ప్రమాదముంది. అంచేత విధి ముఖముగా దాన్ని భావించనే రాదని కఠినంగా శాసిస్తారు భగవత్పాదులు.

   అయితే విధి ముఖం కాకుంటే మరి ఎలా భావించాలని ప్రశ్న వస్తుంది. నిషేధ ముఖంగా Negative or Indirect భావన చేయాలని సలహా ఇస్తారాయన. నిషేధమనేది అపవాదానికి పర్యాయమే Synonym నని ఇంతకుముందే పేర్కొన్నాము. ఇది కాదిది కాదని త్రోసిపుచ్చటమే నిషేధమంటే. నేతినేతి- అని ఉపనిషత్తులలో బోధించిన మార్గమిదే అసలు. శాస్త్రం నేతి నేతి అని రెండు మార్లు దేనికి బోధించటమని ప్రశ్న వచ్చింది. దీనికి బహుభంగుల వ్యాఖ్యానం చేసి చెప్పారు భాష్యకారులు. ఈ రెండింటిలో మొదటి నకారం మూర్తమయిన జగత్తును నిషేధిస్తే రెండవ నకార మమూర్తమయిన అవ్యక్తాన్ని నిషేధిస్తుందని ఒక అర్థం. పోతే మొదటిది భూతరాశిని కాదని త్రోసిపుచ్చితే రెండవది వాసనా రాశిని నిరాకరిస్తుందని మరి ఒక అర్థం. ఇవీ కాకపోతే ఇంకొక చక్కని అర్థం కూడా చెప్పుకోవచ్చునంటారాయన. అదే వీప్సార్ధం. వీప్స అంటే ఏదేది మనముందని భావిస్తుంటామో అదంతా లేదని త్రోసివేయటం. అలా కాక ఎక్కడి కక్కడ గోచరించినవి మాత్రమే చూచి ఇవి లేవని చెప్పామనుకోండి. ఇవి కాకపోతే మరొకటేదైనా బ్రహ్మమేమో అదెలా ఉంటుందో చూడాలనే అన్వేషణ బయలుదేరుతుంది.

Page 127