#


Back

   పైకి చూస్తే ఇవి రెండూ చాలా విరుద్ధమయిన భావాలుగా తోచవచ్చు. కాని దానికి సహజంగా ఉన్న ఈద్వైవిధ్యాన్ని గమనిస్తే అందులో ఎలాటి వైరుధ్యమూ కానరాదు. చాలా చక్కగా సమన్విత మవుతాయి. ఎలాగని అడగవచ్చు. మనసు సవికల్పమయిన దృష్టి వదలనంత వరకూ అది ప్రాకృతం Physical. కేవలమూ నామరూపాత్మకమయిన విశేష రూపాలను చూడవలసిందేగాని వాటిని సామాన్య రూపంగా అనుసంధించుకో లేదు. మామూలు సామాన్యాలనే అలా భావన చేయలేకపోతే అది మహా సామాన్యమైన బ్రహ్మచైతన్యాన్ని ఎలా భావించగలదు. అది ఏనాటికీ దాని అవగాహనకు రానేరాదు. ఇలాంటి ప్రాకృతమయిన మనస్సును దృష్టిలో పెట్టుకొనే బ్రహ్మస్వరూప సాధనకది పనికి రాదని చాటింది శాస్త్రం. పోతే ఈ మనసునే శాస్త్రాచార్యోపదేశ సాహాయ్యంతో అంతకంతకు పదను పెట్టగలిగితే అది నామరూపాల పరిధిని దాటి నిర్వికల్ప మవుతుంది. అప్పుడది ప్రాకృతం కాదు. సంస్కృతం Refined. అలాంటి మనస్సు తప్పకుండా అఖండమయిన ఆ బ్రహ్మచైతన్యాన్ని పట్టుకోగలదు. ఎందుకంటే మనసుకు సంస్కారమేర్పడే కొద్దీ సూక్ష్మమైన తత్త్వాన్ని నిరీక్షంచగలదు. నిరతశయ సూక్ష్మమైనది ఆత్మతత్త్వం. దాన్ని బాగా పరిశుద్ధమయిన మనసు అందుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇదుగో ఇలాంటి సంస్కృతమయిన మనస్సును మనసులో పెట్టుకొనే శాస్త్రం మనసనేది ఒక్కటే సాధనమని మరలా లోకానికి చాటి చెప్పింది. ఇంతకూ సవికల్పమయిన మనసుకు కాకపోయినా అంతకంతకు నిర్వికల్పమయిన దృష్టి నలవరుచుకొంటే మాత్రమెప్పటికైనా బ్రహ్మం మన గుప్పిటిలోకి రాకపోదని ఫలితార్ధం.

   ఆ మాటకు వస్తే అసలు మనసుచేత బ్రహ్మతత్వాన్ని భావించనే వద్దని నిషేధించారు భగవత్పాదులు ఎందుకంటే ఉత్తమాధికారి కయితేనే అది లాభసాటి. అందులోని మెళకువ నర్థం చేసుకొని అతడు ముందుకు సాగిపోగలడు. మరి మంద మధ్యమాధికారులైతే అలా అర్ధం చేసుకోలేరు. చేసుకోలేకపోగా అపారమైన నష్టానికి పాలవుతారు. ఎందుకంటే బ్రహ్మమనేది ఆత్మ స్వరూపం.

Page 126